Categories
Gagana WhatsApp

ఇదే ఆమె ఇచ్చిన కానుక… (అబ్బూరి ఛాయాదేవి )

బోడపాటి పద్మావతి గారి మాటల్లో…

ఛాయాదేవి గారితో వ్యక్తిగతంగా నాకంత ఎక్కువగా పరిచయంలేదు .బెంగుళూరు వెళ్లక ముందు హైద్రాబాద్ లో వున్నప్పుడు ఎక్కడయినా మీటింగుల్లో కనపడినప్పుడు నవ్వుల్తో పలకరించుకోవటమే . ఏదైనా మాట్లాడాలాంటే ఆవిడ పెద్దరికం తెచ్చిన బిడియం ఏదో నాలో పనిచేస్తూ వుండేది .

అబ్బూరి ఛాయాదేవి గారి పుస్తకంలో ఆడవాళ్లు అందరికీ ఇష్టమయిన ‘ సుఖాంతం ‘ , ‘ బోన్సాయ్ బతుకు ‘ ఇవేకాకుండా నాకు ప్రత్యేకంగా ఇష్టమయిన కథలు ఇంకో రెండు మూడున్నాయి . ‘ ఎవర్ని పెళ్లాడాలి’ అని ఒక కథలో ఒకమ్మాయి విచికిత్స పడుతూ వుంటుంది .తమాషా గా వున్నా చాలామంది ఆడపిల్లలు అలాగే ఆ టైంలో ఆందోళనపడుతూ ఉండేవారు . ఇంకోకథ ఆఫీస్ ల్లో ఒకతను వేధింపులకు గురిచేస్తుంటే ఆ అమ్మాయి పై స్థాయి వరకు కంప్లైంట్ ఇచ్చి ట్రాన్స్ఫర్ తెప్పించుకుంటుంది . ఆ వేధించిన వ్యక్తి ఆ అమ్మాయితో అదేదో ఆ పనేదో నాతో చేస్తే ఇక్కడే సుఖంగా వుండేదానివి కదా అంటాడు . పెళ్లికాని ఆడపిల్లలు లైంగికంగా కాకపోయినా ఏదో ఒక మేరకు లొంగివుండకపోతే ఎలా వేధిస్తారో ఆ కథ చెబుతుంది .

ఇంకో కథలో ఒకమ్మాయి పెళ్లి వొద్దనుకుని చాన్నాళ్ళూ కెరీర్ కోసమూ , తనుగా నిలబడటం కోసమూ తన జీవితంలో ప్రైమ్ టైం లో గట్టిగా పట్టుదలగా ఉండి తను పనిచేసే సీనియర్ లాయర్ తో సంబంధంలోకి వెళ్ళిపోతుంది అనూహ్యంగా . బయట వత్తిళ్ల సంగతి పక్కన పెడితే లోపల కనపడని వత్తిళ్లు ఏ రకంగా పనిచేస్తాయో ఆ కథ చెబుతుంది . ‘ ఆఖరికి అయిదు నక్షత్రాలు ‘ కథ అందరికీ తెలిసిందే . వైద్యంలో కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాక ఆ కథ అప్పట్లో అలాటి మొదటి కథ . ఎంత సెన్సేషనల్ అయిందో నాకు గుర్తుంది .

ఒకసారి చాలామంది స్నేహితులతో కలిసి బాగ్ లింగంపల్లిలో వున్న వాళ్ళింటికి పోయాను . ఆవిడ సరదాగా తాను చాటలో చేసిన ‘ చాటభారతం ‘ చూపించారు . ఎక్కువెక్కువ మాట్లాడుతుంటే పెద్దవాళ్ళు నీ చాటభారతం ఆపు అని విసుక్కోవటం గుర్తుకొచ్చింది . ఆవిడ అవన్నీ చూపించాక

ఆయన పోయాక అంటే అబ్బూరి వారు పోయాక కూడా ‘ నేను బాగానే ఉంటున్నాను . ఇదేమన్నా లోపమంటారా నాలో ‘ అన్నారు హాస్యస్పోరకంగా . అప్పుడు తెలిసింది నాకు ఆవిడలో వున్న గట్టిదనం . పిల్లలు లేరని దిగులుపడకుండా , ఆయన పోయాక అదేలోకంలో వుండకుండా తనకు చేతనయిన పనిచేస్తూ , తనను తాను సంతోషంగా , ఎంగేజ్డ్ గా ఉంచుకోవడం ఎంతమంది ఆడవాళ్లు చేయగలరూ ? . ఇది ఆవిడనుండి నేర్చుకోవాల్సిందే మనం .

ఆవిడ వెళ్లిపోయారు అని తెలిసిన తరవాత ఆవిడ గురించిన నా తలపోతలు ఇవి .

Leave a comment