ఓ అరగంటని మీకోసం కేటాయించండి.

నీహారికా, ఇంటా బయటా పని వత్తిడితో నలిగిపోయే మహిళలు ఎప్పుడూ చేసే పొరపాటు ఏమిటంటే ఆ పనుల్ని కుటుంబ సభ్యులతో షేర్ చేయకపోవడం. అన్ని పనులు మనమే చేద్దామని పూనుకోవడం వల్లనే ఎంతో వత్తిడీ, శ్రమ. ఏ పనీ సమయానికి పూర్తి కాకపోవడమే రిజల్ట్. కొన్ని పనులు పక్కవాళ్ళకి అప్పగిస్తే, పిల్లలు, పెద్దలు అలవాటుగా కొన్ని పనులు చేసేటట్లు చేస్తే అప్పుడు కాస్త పని వత్తిడి తగ్గే అవకాశం వుంటుంది. సరిగ్గా ఏ పని ఎప్పుడు చేయాలో, ఒకపని తర్వాత ఇంకో పని ఏం చేయాలో అవగాహన లేనప్పుడు మనకు తెలియకుండానే సమయం వృధా అవుతుంది. దేనికెంత ప్రాధాన్యం ఇవ్వాలో ఒక స్పష్టమైన అవగాహనతో పనులకు ఓ క్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఒక్కసారి దేని ప్రాధాన్యత దానిదే అనిపిస్తూ ఒత్తిడి పెరిగిపోతూవుంటుంది. అప్పటికప్పుడు ఎదురయ్యే అవసరాలు దృష్టిలో పెట్టుకుని కొన్నింటిని అవతల పెడతాం. అప్పుడూ ఇదే సమస్య. ప్రాధాన్యతా క్రమంలో మనం లిస్టు లో మొదట పెట్టుకోవలసింది ఇంట్లో పనులా? లేదా చేసే ఉద్యోగ బాధ్యతలా? లేదా ఇల్లాలిగా ఉన్నా సరే ఉన్న పనికి తోడుగా వచ్చే పెద్దవాళ్ళ ఆలనాపాలనా వంటి అదనపు బాధ్యతలా? అప్పుడు మాత్రం ఒక పేపర్ పైన పర్ఫెక్ట్ ప్రణాళిక వేసుకోవాలి. ఉన్న సమయం సరిగ్గా వినియోగించుకోవాలి. ఒక టైమ్ టేబుల్ సృష్టించుకోవాలి. సరే నిద్రకు పోగా మిగిలిన గంటలన్నీ టైమ్ టేబుల్ లో నిండిపోయినా ఒక అరగంట మాత్రం సొంతంగా ఉంచుకోవాలి. అది పనుల ఒత్తిడి నుంచి సేదదీర్చే విశ్రాంతి. ఆ అరగంట నచ్చిన పని ఏదో చేస్తే మిగిలిన సమయంలో కష్టపడిన అలసట అంతా మాయం అవుతుంది.