కొన్ని సినిమాలు తీయటానికి స్క్రిప్ట్ ఉంటే సరిపోతుంది కానీ… కొన్ని సినిమాలకు గట్స్ కావాలి సినిమాని ఒక ఆర్ట్ గా మోహించే ప్రేమ ఉండాలి. నిజమే సినిమా అనేదే ఆర్ట్ అనుకున్నప్పుడు “ఆర్ట్ సినిమా” అనే ఒక జోనర్ ఏర్పరుచుకోవటం అనే వింత స్తితిలో పడిపోయాం. దాన్ని బద్దలు కొట్టిన ఒక హీరో రీతూపర్ణో ఘోష్ ఇండియన్ సినిమా మీద ఒక చెరిగిపోని సంతకం. దర్శకుడు, నటుడూ, కథారచయిత, లిరిసిస్ట్. 19 ఏళ్ల సినిమా కెరీర్లో 12 జాతీయ అవార్డులు కొట్టిన కళాకారుడు, అత్యంత తీవ్రంగా సినిమాని ప్రేమించాడు, “చిత్రాంగద” రీతూ సినిమాల్లో ఒక అద్బుతం. గే కమ్యూనిటీనీ, ట్రాన్స్ జెండర్నీ ఇంకా సినిమాల్లో కామెడీ కోసం వాడుకుంటున్న ఇదే ఇండియన్ సినిమాలో అదే సబ్జెక్ట్ తో ఒక అద్బుతాన్ని తీసి దేశం మీదకి విసిరేసాడు.

రుద్ర చటొర్జీ ఒక స్టేజ్ ఆర్టిస్ట్, నాటకాలంటే వల్లమాలిన ఇష్టం సడేన్ గా తాను స్త్రీగా మారిపోవాలనుకుంటాడు. స్త్రీగా మారటానికి కావాల్సిన ఆపరేషన్ కి సిద్దమవుతాడు. కానీ ఎందుకు?? ఈ విషయాన్ని తాను వేయబోతున్న నాటకాన్ని చూపి మనకు అర్థమయ్యేలా చేస్తాడు. చిత్రాంగద మణిపురీ రాజుకి ఒక్కగానొక్క కుమార్తె. రాజ్యాన్ని పరిపాలించటానికి కొడుకే కావాలనుకున్న రాజు ఆమెని తాను స్త్రీ అన్న విషయం ఆమెకే తెలియకుండా పూర్తి మగవాడిలా పెంచుతాడు. కానీ ఎన్నాళ్ళు తనది కాని అస్తిత్వాన్ని తానుమొయ్యగలదు? ఒక రోజు వేటకు వెళ్ళిన చిత్రాంగద అర్జునున్ని చూసి ప్రేమలో పడుతుంది, అతన్ని మోహిస్తుంది అప్పుడు అర్థమవుతుంది ఆమెకు తాను పురుషున్ని కాననీ తాను వేరనీ తెలుస్తుంది.. ఒకానొక అంతహ్ సంఘర్షణ అది అప్పటివరకూ ఉన్న తాను తానుకాననీ ఆమెకు అర్థమైన సంధర్భం “చిత్రాంగద” స్త్రీగా మారిపోతుంది.

అసలు సినిమా ఓపెనింగ్ సీన్ హాస్పిటల్లో రుద్ర ఒక సైక్రియాటిస్ట్ తో మాట్లాడుతున్నట్టు మొదలవుతుంది. అప్పటికే అతని బ్రెస్ట్ ఇంప్లాంట్ ఆపరెషన్ పూర్తయ్యింది. శారీరకంగా అటు పురుషుడికీ ఇటు స్త్రీకీ మధ్యలో ఉన్నాడు. అనతకు ముందు రోజు అతని గదిలోకి వచ్చిన సిస్టర్ రుద్ర ని “సర్” అని పిలిచినప్పుడు.
“సిస్టర్ నేనెందుకు ఇక్కడ ఉన్నానో తెలుసా? అని అడుగుతాడు. దానికామె తెలుసన్నట్టు చెప్పగానే…. ఇప్పుడు తాను స్త్రీగా మారిపోవటానికి శారీరకంగానే కాదు మానసికంగా కూడా ప్రిపేర్ అవ్వాలనీ కానీ పదే పదే సర్ అన్న పిలుపు తనని డిస్టర్బ్ చేస్తుందనీ చెప్తాడు. హాస్పిటల్ వాళ్ళు తనకోసం, ఏర్పాటు చేస్తోన్న సైక్రియాటిస్ట్నికూడా వద్దంటాడు. అత్యద్బుతమైన సన్నివేశం అది ప్రేక్షకుడు తానేం చూడబోతున్నాడో అప్పటికే ఒక ఉద్దెశానికి వస్తాడు కానీ అత్యద్బుతమైన విజువల్ నరేషన్ ని మాత్రం ఊహించలేడు. రెండోరోజు వచ్చిన సైక్రియాటిస్ట్ నెమ్మదిగా రుద్రాని మాటల్లో పెట్టి అతనితో మాట్లాడటం మొదలు పెడతాడు….
ఇక్కడ ఫ్లాష్బ్యాక్ లోకి వెళ్ళే సీన్ అత్యంత అద్బుతం ఇంతవరకూ ఏదర్శకుడూ ఈ తరహా ప్రజెంటెషన్ ఇచ్చిఉండడేమో. ఒక్కసారి గతంలోకి వెళ్తాడు రుద్రా. చిత్రాంగద కథని నాటకంగా వేయలని ప్రయత్నిస్తున్నప్పుడు రుద్రా కి పరిచయం అవుతాడు “పార్థో” ఒక డ్రమ్మర్ కానీ డ్రగ్స్ కి బానిస. నాటకానికి డ్రమ్స్ వాయించటానికి వచ్చి అక్కడ చేసిన మిస్బిహేవ్ కి రుద్రతో దెబ్బలు తింటాడు, అతని కాలిగజ్జెలని బాత్రూం కమోడ్ లో పడేసి అక్కడనుంచి వెళ్ళగొట్టబడతాడు. కానీ అదేరోజు రాత్రి మళ్ళీ మువ్వలతో వచ్చి కన్నీళ్ళతో కాళ్ళు కడిగి అతని కాలికి మువ్వలు కడతాడు. ఇద్దరిమధ్యా ప్రేమ ఏర్పడుతుంది…. అవును ఇద్దరు మగవాళ్ళ మధ్య “ప్రేమ” కానీ ఇన్నాళ్ళ సమాజం లో మనం అసహ్యించుకునే ఈ తరహా సంబందం కూడా ఎంత గొప్పగా చూపించాలో అంతగొప్పగానూ ఉంటుంది. ఈ ఇద్దరి సంబందాన్ని అనేకానేక సంఘర్షణలమధ్యా రుద్రా తల్లితండ్రులుకూడా ఒప్పుకుంటారు. తనలో ఉన్న భావసంఘర్షణని తల్లిదండ్రులకు వివరించే సీన్ మనల్ని రుద్రాకి దగ్గర చేస్తుంది. రుద్రా పార్థొ ఇష్టాలని కూడా ప్రేమిస్తాడు ఎంతగా అంటే అతను తీసుకునే హెరాయిన్ స్మెల్ ని అతని పెదాల మీద చూసేంతగా పార్థో ని ప్రేమిస్తాడు. కానీ అనుకోకుండా ఒక రోజు పార్థోకి పిల్లలంటే ఇష్టం అని తెలుస్తుంది. కానీ తను ప్రేమని, సెక్స్ ని మాత్రమే ఇవ్వగలడు పిల్లలని ఇవ్వలేడు. ఇద్దరు మగ దంపతులకు పిల్లలని దత్తత తీసుకునేందుకు మన చట్టాలు ఒప్పుకోవు కాబట్టి తాను స్త్రీగా మారాలనుకుంటాడు రుద్రా. స్త్రీగా మారే ఆపరేషన్ కి సిద్దపడతాడు. అక్కడ మొదలవుతుంది భయంకరమైన మానసిక సంఘర్షణ. మళ్ళీ ఈ దారుణమైన నిర్ణయాన్ని తండ్రి వ్యతిరేకిస్తాడు కానీ చివరికి రుద్రా ఏం చేయాలనుకుంటే అది చేయమనీ చెప్తాడు. వరుస ఆపరేషన్లలో భాగంగా మొదట “సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్” జరుగుతుంది. లీగల్ గా చేయాల్సిన పనులలో కొన్ని పేపర్లు సిద్దం చేసుకొని వస్తాడు తండ్రి అయితే అవన్నీ అవసరం లేదంటాడు రుద్రా. “కనీసం నువ్వైనా నీ కొడుక్కి నచ్చ చెప్పు అని భార్యతో అనబోయి” ఆగిపోతాడు. ఇప్పుడు రుద్రాని కొడుకు అనాలా కూతురు అనాలా??? ఎవ్వరూ సమాధానం చెప్పలేని ప్రశ్న. ఇంకా అక్కడిదాకా మనం ఎదగలేదా? యేమో మరి…..

అయితే ఇంత జరిగాక ఊహించని షాక్ తగులుతుంది రుద్రాకి ఎవరికొసం అయితే తన అస్థిత్వాన్ని వదులుకోవాలి అనుకున్నాడో ఆ పార్థో ఇప్పుడు రుద్రాని అసహ్యించుకుంటాడు. కొత్తగా పెట్టిన స్థనాలని చూసి మొహం తిప్పుకుంటాడు. నేను ఇలా స్థనాలే కావాలి అనుకుంటే నిజమైనవే కోరుకునే వాన్ని కానీ ఇలా సిలికాన్ అవయవాలని కాదు అని మొహమ్మీదే చెప్పేస్తాడు అంతే కాదు తాను రుద్రా డ్రామా ట్రూప్ లోనే ఉన్న ఇంకో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాననీ ఆమె గర్భవతీ అని కూడా చెప్పేస్తాడు”. ఎవరు ఎవరికోసం ఎందుకోసం మారిపోయారు? శరీరం మార్చుకోవటం గొప్ప ప్రేమా? లేదూ మగవాడైన రుద్రాని రుద్రాగానే ఇష్టపడ్డ పార్థొ ది గొప్పప్రేమా?? ఎలా ఉంటే అదిప్రేమ? ఎవరిని ప్రేమిస్తే అదిప్రేమ? సమాధానం?????

ఇదంతా విన్న సైక్రియాటిస్ట్ అప్పుడు అడుగుత్రాడు “రుద్రా అసలు నువ్వు నీకోసమే జీవిస్తున్నావా? ఏవరికోసమో నువ్వే లేకుండాపోతున్నావా? అని” ఇప్పుడు మరో సంఘర్షణ. ఇప్పుడు ఈ స్థితిలో తానేం చేయాలి? తెల్లవారితే తన పురుషాంగాన్ని యోనిగా మార్చే ఆపరెషన్ జరగబోతోంది. దాంతో రుద్రా పూర్తి ఆడదానిగా మారిపోతాడు కానీ ఇప్పుడు పార్థో లేడు ఎవరికోసమైతే తానే లేకుండా పోవాలనుకున్నాడో ఆ మనిషే లేనప్పుడు ఇక తాను మారినా మారకున్నా ఏం ప్రయోజనం? సైక్రియాటిస్ట్ వెళ్ళిపోయాడు…. కొన్ని గంటల ఆలోచనల తర్వాత తన డాక్టర్కి ఫోన్ చెస్తాడు. రేపు ఆపరేషన్ జరుగుతుందనీ అయితే తన బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తీసేయటానికే ఆ ఆపరేషన్ అనీ చెప్పేస్తాడు. ఆపరేషన్ జరగటానికి ముందుగా తనని సిద్దం చేస్తున్న సిస్టర్ తో సైక్రియాటిస్ట్ ప్రస్తావన వచ్చినప్పుడు.

“మొదట అడిగినప్పుడు తిరస్కరించటం తో అసలు సైక్రియాటిస్ట్ నే తాము పంపించలేదనీ, బహుశా హై డోసెజ్ డ్రగ్స్ వల్ల కలిగిన ఇల్యూజనేషన్” అయిఉండవచ్చనీ చెప్పేస్తుంది. అంటే రుద్రా మనస్సు ఏం కోరుకుంటూందో అదే ఆ సైక్రియాటిస్ట్ అన్నమాట, లోలోపల అతని మనస్సు ఏం చేయమని చెప్తూందో అదే ఆ సైక్రియాటిస్ట్.. అతని నిజమైన కోరిక అతను అతనుగా ఉండటమే ఈ బంధాలూ, త్యాగాలూ అని చెప్పబడే “ప్రేమ” ఎప్పటికీ నిజమైనది కాదని అర్థమౌతుంది (రుద్రా కి మాత్రమే కాదు ప్రేక్షకుడుకి) తానేమిటో అదే నిజం అలాగే తను ఉండాలి.

ఆపరేషన్ కి అంతా సిద్దమయ్యింది మత్తు ఇచ్చేటప్పుడు డాక్టర్ అడుగుతాడు ఎవరితో అయినా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అని. పార్థో నంబర్ చెపాడు. అయితే డాక్టర్ కాల్ చేసే సమయానికి పార్థో దూరంగా వెళ్ళిపోతూంటాడు. సిగ్నల్ ప్రాబ్లం వల్ల పార్థో ఆకాల్ ని రిసీవ్ చేసుకోలేడు. మత్తులోకి వెళ్తోన్న రుద్రాకి డాక్టర్ చెప్పిన చివరి మాట “అతను మీకు చెప్పమన్నది ఒకటే… మీ మనసు ఏం చెప్తూందో అది చేయమని” అని. తర్వాత ఆపరేషన్ మొదలయ్యింది రుద్రా ని మళ్ళీ రుద్రా గా మార్చటానికి…. సినిమా ఇక్కడితో అయిపోయినట్టే.

అయితే రుద్రా మనలో అప్పటికే ఇంకిపోతాడు “చిత్రాంగద” మనలో కలిసిపోతుంది “నువ్వు నీలా ఉండటమే అంతిమం” అన్న మాట చెవుల్లో గింగిర్లు ఎత్తుతుంది. మనం మనలా ఉండటానికి ఎన్ని ఘర్షణలు పడాలో అన్న యుద్దం మొదలు అవుతుంది. ఒక్కొక్క ఫ్రేమ్ గుండెలని తొలిచేంత హృద్యంగా మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. అసలు ఇలాంటి ఒక సబ్జెక్ట్ ని తెరమీదకి ఎక్కించటమే ఒక సాహసం అనుకుంటే అత్యద్బుత విజువల్ పొయెట్రీలా తీర్చిదిద్దిన తీరు మరింత ఆకట్టుకుంటుంది. కెమెరా, ఆర్ట్ వర్క్, నటీనటులూ ఇవన్నీ… పక్కకు జరిగిపోతాయి రీతూపర్ణో లాంటి దర్శకున్ని 49 ఏళ్ళకే కోల్పోయిన భారతీయ సినిమా ఎంత నష్టపోయిందో అర్థమవుతుంటే గుండేలు పిండినంత భాద కలుగుతుంది. చోకర్ బాలి, మెమొరీస్ ఇన్ మార్చ్, రెయిన్‌కోట్‌, దహన్‌, ఉత్సవ్‌, దొసొర్‌, ద లాస్ట్‌ లియర్‌, శోబ్‌ చరిత్రో, కాల్పొనిక్‌ లాంటి సినిమాలని వెతికి వెతికి మరీ చూడాలనిపిస్తుంది. గే, ట్రాన్స్ జెండర్ లాంటి లక్షణాలు ఉన్న మనిషి కనబడితే అతనితో ఫ్రెండ్లీగా మాట్లాడాలి అనిపిస్తుంది….. మొత్తంగా మనల్ని మనం కనుగొన్నట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే రాయటం ఎలాగో, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వాడాలో, నటుడు అనేవాడు ఎంత సహజంగా ఉండాలో తెలుసుకోవటానికి ఈ సినిమా ఒక గొప్ప పాఠం. ఆర్ట్ సినిమా అంటే అదేదో మేధావుల సినిమా అనుకునే అభిప్రాయాన్ని దారుణంగా బద్దలుకొట్టే సినిమా. యూ ట్యూబ్ లో లింక్ దొరుకుతుందో లేదో తెలియదు గానీ వెతికి వెతికి మరీ చూడల్సిన సినిమా “చిత్రాంగద”

-నరేష్ కుమార్

Leave a comment