ఈ మధ్యనే జరిగిందీ సంఘటన. ఎవరో వీడియో తీస్తే మీడియాలో విహారం చేస్తోందీ విషయం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బులంద్ షహర్ అనే ప్రాంతంలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న శ్రేష్ఠ ఠాకూర్ లైసెన్స్ చూపించమని ఓ వ్యక్తిని అడిగింది, లేదన్నాడతను. అతనికి చలాన్ ఇచ్చి 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పింది శ్రేష్ఠ. ఆమె మీద అరవటం మొదలు పెట్టాడతను. వెంటనే శ్రేష్ఠ అతనిని అరెస్ట్ చేసింది. ఇక ఆ వ్యక్తికి సంబందించిన వాళ్ళు స్టేషన్ ముందు ధర్నా చేశారు. మేం అధికార పార్టీ వ్యక్తులం అని కూడా చెప్పి గొడవకు పూనుకున్నారు. శ్రేష్ఠ ఠాకూర్ ఏ మాత్రం బెదరకుండా హుందాగా, ధీమాగా నడుంపైన చెయ్యేసుకుని నిలబడి, మేం మా విధులు నిర్వర్తిస్తున్నాం. పిల్లాజల్లాని వదిలేసి రాత్రింబవళ్ళు పని చేస్తున్నాం. సరైన పత్రాలు లేకుండా స్కూటర్ నడిపితే చర్యలు తీసుకోవడం నా కర్తవ్యం. మీరు అధికార పార్టీ అంటూ ఇలాంటి చర్యలకు దిగితే ప్రజలు మిమ్మల్ని గుండాలంటారు. చూసుకోండని చెప్పేసింది శ్రేష్ఠ. ఈ విషయాన్ని ఎవరో షూట్ చేసి పోస్ట్ చేస్తే అది కాస్త ఇప్పుడు వైరల్ అయి కూర్చుంది. ఆమె ఎంత ధీమాగా నిలబడిందో చూస్తే ముచ్చటేస్తుంది. సింహంలా ఆమె గర్జించడం అందరూ ఎంజాయ్ చేశారు.

Leave a comment