ఎన్ని నేర్చుకున్నా వంటగదిలో మనకింకా ఎన్నో తెలియని విషయాలు వుంటూనే వుంటాయి. కూరగాయలు మాంసం చేపలు వుడికించే సమయంలో పెరుగు కలిపితే పోషక విలువలు పెరుగుతాయి. పెరుగు కాల్షియం ప్రోటీన్లు విటమిన్ బి 12 కు మంచి ఆధారం పెరుగువల్ల పదార్ధాలకు అదనపు రుచి పోషకాలు దక్కుతాయి. నీళ్లలో వెనిగర్ వేసి స్ట్రా బెర్రీస్ ,గ్రేప్స్ వంటి పండ్లను కడగాలి. బట్ట తో తుడిచి ఆరనిచ్చి మూతవున్న డబ్బాలో ఉంచి ఫ్రిజ్ లో పెడితే పాడవకుండా ఉంటాయి. చెక్క గరిటలకు నూనె జిడ్డు అంటుకుని వదలకపోతే కాస్త టేబుల్ సాల్ట్ చల్ల టిస్యూ పేపర్ తో తుడవాలి. ఇన్స్టెంట్ కాఫీ పొడి గడ్డ కట్టకుండా వుండాలంటే  ఎయిర్ టైట్ డబ్బా లో ఉంచి డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి. వంట చేసేప్పుడు చేతులకు అయ్యే మరకలు బంగాళా దుంప ముక్కతో రుద్ది కడిగితే పోతాయి. అన్నం పొడి పొడిగా రావాలంటే ఉడికేప్పుడు చెంచా వంట నూనె వేస్తె పొడిపొడిగా అయిపోతుంది . పంచదార డబ్బాకు చీమలు పడుతుంటే అందులో కొన్ని లవంగాలు అందులో వేయండి.

Leave a comment