ఎన్ని రకాల ఫ్యాషన్ డ్రెస్ లు వచ్చిన చీరెను మించిన అందమైన ఆహార్యం ఇంకొకటి లేదు .చీరెను ధరించటంలో ఒక సందర్భం గొప్ప పాత్ర పోషిస్తుంది .వేడుక సమయాల్లో ఖరీదైన పట్టు చీరెలు ,ఆఫీస్ కు, బయటకు వెళ్లేందుకు సిల్క్ కాటన్ చీరెలు,సాదాసీదా ఫంక్షన్ లకు జరీ చీరెలు హుందాగా కనిపించేందుకు గోరంత జరీ కూడా లేని కాటన్ చీరలు బావుంటాయి. ఇవ్వాళ ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశపు చీరకట్టు గొప్ప ఫ్యాషన్ .హిందూ నాగరికత కాలం నాటికే చీరె ధరించే సంప్రదాయం ఉంది .ప్రాచీన కాలపు చిత్రాలలో రాతి  విగ్రహాల్లో చీరె మడతలు,కుచ్చెళ్ళు చాలా అందంగా చెక్కినట్లు కనిపిస్తాయి .చీరె నేతలోనే ఆ కళాకారుల హస్తకళా నైపుణ్యం కనిపిస్తుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ముస్లిన్ బాబే దాది చీరెలకు ప్రసిద్ధి. ఇవెంత నాజూకైన వీ అంటే వీటిని పచ్చగడ్డి పైన పరిస్తే పలుచగా గడ్డి పైన మంచు పొరలాగా కనిపిస్తాయి. చత్తిస్ ఘడ్ కోసా సిల్క్, మధ్యప్రదేశ్ కి చెందిన చందేరీ-మహేశ్వరి, బీహార్ నుంచి  తుస్సార్ చీరెలు .అస్సాం మగ్గం చీరెలు వారణాసి నుంచి బనారస్ పట్టు, తమిళనాడుకు చెందిన కంచి ఆరణి తంజావూర్, మధుర కోయంబత్తూర్ నేత చీరెలు ధర్మవరం, వెంకటగిరి, గద్వాల పోచంపల్లి, గుంటూరు ఉప్పాడ చీరెలు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన చీరెల రకాలు ఎప్పటికీ ఎవ్వర్ గ్రీన్. పెద్దంచు కంచి చీరెలు చూస్తే ఎం ఎస్ సుబ్బలక్ష్మి, కాటన్ అంచు చీరెలు చూస్తే విద్యాబాలన్, సరిగంచు  చీరెల్లో బాలీవుడ్ నటి రేఖ మెరిసిపోతూ కనిపిస్తారు చీరె ఒక వింటేజ్ అట్రాక్షన్ !

Leave a comment