Dynamic ECG changes:

ఒకరికి ఛాతి నొప్పి వచ్చిందనుకుందాం. ఈసీజీ తీశారు. దానిలో పెద్దగా మార్పులు లేవు. అపుడు డాక్టర్లు ఏ గ్యాస్ ట్రబులో అనుకుని pantoprazole వంటి ఇంజెక్షన్ ఇచ్చారు‌ అనుకుందాం. కాసేపటికి నొప్పి తగ్గిందా సరేసరి. తగ్గలేదంటే…”ఏమీ కాదులే తగ్గిపోతుందిలే” అని కొంతమంది ఇంటికి వెళ్ళిపోతామని తొందర పెడుతూ ఉంటారు. చాలా మందికి హాస్పిటల్ లో ఉండటం ఇష్టం ఉండదు. పేషంటు కంటే పేషెంట్ అటెండర్లకు అసహనం ఎక్కువ. హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తే పేషెంట్ తో పాటు రాత్రంతా ఎక్కడ పడుకోవాల్రా దేవుడా అనే ఆలోచనలో ఉంటారు. “ఏం లేదు ఏంలేదు తగ్గిపోతుంది”. అని చెబుతుంటారు. Half knowledge is always dangerous అనేది అందుకే. అంతేకాక తన వాళ్ళకూ ఏమీ కాదు అనుకునే ఓ తత్త్వం కూడా ఉంటుంది. గుండెజబ్బు రాదు అనే కాగ్నిషన్ నుంచి గుండెజబ్బు ఉందని డాక్టర్లు చెప్పేసరికి ఒకరకమైన కాగ్నిటివ్ డిసోనాన్స్ కు లోనౌతుంటారు.

విషయం ఏమంటే..ఛాతి నొప్పి వచ్చినపుడు ఒక్కోసారి ఈసీజిలో మార్పులు కనపడక పోవచ్చు. Pantoprazole వంటి ఇంజెక్షన్లు ఇచ్చినా నొప్పి తగ్గటం లేదంటే ఈసీజీని రిపీట్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ అర్దగంటకూ ఈసీజీ తీస్తూ అందులో ఏమైనా కొత్త మార్పులు వస్తున్నాయా అని పరిశీలిస్తారు. కాబట్టి చెప్పేదేమిటంటే ఛాతిలో నొప్పి ఉన్నప్పుడు ఒక్క ఈసీజీ నార్మల్ ఉన్నంత మాత్రాన మొత్తం నార్మల్ ఉన్నట్టు కాదు. ఈ కండీషన్ ను unstable Angina అంటారు. అందుకే నొప్పి తగ్గక పోతే ఒకటి రెండు రోజులు observation లో ఉంచటం జరుగుతుంది.

ఇటువంటి పేషంట్లలో ఈ ఒకటి రెండు రోజుల్లో సడెన్ గా ఈసీజీ లో మార్పులు కనిపించటం మొదలైతే ..వెంటనే heart attack లా గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగుతుంది. ఏ మార్పులూ లేకపోతే డిశ్చార్జి చేస్తారు. ఐతే తరువాత మాత్రం వాళ్ళు cardiovascular risk assessment చేయించుకోవటం మంచిది.

–డాక్టర్.విరివింటి.విరించి(కార్డియాలజిస్ట్)

Leave a comment