గుండె నొప్పి వచ్చినపుడు హాస్పిటల్ కి వెళ్ళే కంటే ముందు రెండు రకాల మందులు ఉంటాయి.

ఒకటి హాస్పిటల్ వెళ్ళేంత వరకూ నొప్పిని తగ్గించే మందులు…రెండు హాస్పిటల్ వెళ్ళేలోపు గుండె రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించే మందులు. మొదటి రకాన్ని “నైట్రేట్స్” అనీ రెండో రకాన్ని “యాంటీ ప్లేట్ లెట్స్” అనీ అంటారు.

ఐతే ఈ రెండు రకాల్లో చాలా మందికి మొదటి రకం మందు గురించే తెలుసు. అదే నాలుక కింద పెట్టుకోమని చెప్పే సార్బిట్రేట్ అనే టాబ్లెట్. ఇది 5mg లేదా 10 mg గా దొరుకుతుంది. ఇది నాలుక కింద పెట్టుకుంటే నొప్పి తగ్గే అవకాశం ఉంది. ఐతే 5mgతో మొదట మొదలు పెట్టాలి. నొప్పి తగ్గక పోతే పది నిమిషాల తరువాత ఇంకో 5mg వాడితే చాలు. ఐనా నొప్పి తగ్గటం లేదని ఈ మందులను అలా వాడుతూనే పోకూడదు. ఎందుకంటే ఈ మందులు వలన పేషెంటు బీపీ తగ్గిపోతుంది. హార్ట్ పేషంట్లలో అవసరమైన దానికన్నా బీపీ తగ్గితే డేంజర్ కూడా..

నిజానికి మొదటి రకం మందులను వాడకపోయినా పర్వాలేదు. కానీ మనిషి ప్రాణాన్ని కాపాడేది మాత్రం రెండో రకమైన యాంటీ ప్లేట్ లెట్స్ మందులే. ఇవి గుండెనొప్పి వచ్చినప్పుడు సాధారణంగా వాడే డోసులకంటే ఎక్కువ మోతాదులో వేసుకోవాలి. దీనిని లోడింగ్ డోస్ అంటారు. ఇవి అందరి ఇళ్ళల్లో తప్పనిసరిగా ఉండాలి. గుండెనొప్పి రాగానే ఈ మందులు ఎంత త్వరగా వేసుకుంటే అంత మంచిది.

Disprin 300mg
Clopitab 600mg
Atorvas 80 mg

ఇవి వెంటనే వేసుకోవటం వల్ల జరిగే మేలు అంతా ఇంతా కాదు.

Disprin లేదా ecosprin అనేది 75, 150, 300 mg లుగా దొరుకుతుంది. మనకు 300 mg వేసుకోవాలి కాబట్టి 75 mg దొరికితే నాలుగు, 150 mg దొరికితే రెండు ట్యాబ్లెట్లు వాడాలి. సగం డోస్ లు వేసుకుంటే ప్రయోజనం శూన్యం. రక్తం లో త్వరగా ఆ మందు చేరాలంటే ecosprin అనే టాబ్లెట్ కంటే…నీళ్ళల్లో కరిగే disprin వాడటం మంచిది. Disprin ట్యాబ్లెట్ ను సగం గ్లాసు నీళ్ళలో వేయగానే క్షణాల్లో కరిగిపోతుంది. ఆ నీళ్ళను తాగేస్తే సరి. అదే ecosprin ఐతే నోటి ద్వారా మింగాలి.

క్లోపిడోగ్రెల్ మందు క్లోపిట్యాబ్ ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది. 75, 150,300 mg డోసులుగా దొరుకుతుంది. దొరికిన డోస్ ను బట్టి మనకు కావలసిన 600mg dose కు ఎన్ని ట్యాబ్లెట్లు అవసరమో అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి.

Atorvas 10,20,40,80 mg లు గా దొరుకుతుంది. 10mg దొరికితే 8 ట్యాబ్లెట్లు ఒకేసారి వేసుకోవాల్సిందే…

అయ్యే ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలా అని మీన మేషాలు లెక్కబెట్ట కూడదు. గుండె సేఫ్ గా ఉండాలంటే ఈ లోడింగ్ డోస్ తప్పనిసరి.

ఐతే ఒక మంచి విషయం చెబుతాను. మేజర్ హార్ట్ ఎటాక్ వచ్చి ఈ లోడింగ్ డోస్ ను వెంటనే వేసుకున్న పేషంట్లు అదృష్టవంతులు. ఎలా అంటే…కొన్నిసార్లు వాళ్ళు హాస్పిటల్ కు వచ్చిన తర్వాత గుండెను గమనించి చూస్తే మారిన ecg pattern కూడా నార్మల్ స్థితికి వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మందులను ఇంట్లో ఉంచుకోవటం మంచిది. Expiry date చూసుకోవటం తప్పనిసరి.

డా. విరివింటి విరించి (కార్డియాలజిస్ట్)
+91 99486 16191

Leave a comment