నీహారికా,

ఎన్నో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొంటాం. వేడుకల్లో, ఆఫీసుల్లో, ఇరుగుపొరుగుతో ఎన్నో కబుర్లు నడుస్తాయి. అవన్నీ గాసిప్స్ అని కొట్టి పడేస్తే అసలు కబుర్లు ఎలా తెలుస్తాయి. ఇప్పుడు ఆఫీసులో కబుర్లు చెప్పుకొన్నామనుకో అవి మంచి వాతావరణం సృష్టిస్తాయి. పని చేసే వాతావరణం సీరియస్ గా లేకుండా, పని వత్తిడి లేకుండా వుంటుంది కదా. సమాజంలో వివిధ వృత్తులతో పోల్చి చూసుకొనేందుకు సరదా కబుర్లే దోహదం చేస్తాయి. ఈ కబుర్ల వల్ల వ్యక్తిగతమైన నడవడిక పట్ల అప్రమత్తంగా ఉంటారని మానసిక వైద్య నిపుణులు చెప్తారు. ఇతరులని ఇబ్బంది పెట్టని, సంస్కారంతో కూడిన కబుర్లు మానవ సంబందాలని బలపరుస్తాయి. కానీ వాటిని తెలిసి తెలియని విషయాలు ప్రచారం చేసే గాసిప్స్ రూపంలోకి తీసుకు రాకూడదు. పిచ్చాపాటి కబుర్లు స్ఫూర్తి కలిగించేందుకు, సామాజిక విషయాలు అమలు చేసేందుకు, ఉమ్మడి విలువలు, సంబందాలు పటిష్టం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తాయి. అసలు ఏ కబుర్లయినా మనుష్యుల మధ్య రావాలి. అలా మాట్లాడుకోవడానికి ప్రధానమైంది విశ్వాసం. అది ప్రజల మధ్య సంబందాలు ఏర్పరుస్తుంది. మంచి చెడులు తెలుస్తాయి. నడవడికలో ముందు మనల్ని మనం మార్చుకొనే అవకాశం వుంటుంది. సరైన స్నేహాలు ఏర్పడతాయి.

Leave a comment