Categories
నీహారికా,
ప్రమాదాలు రాత్రిపూటే జరుగుతాయి అనుకొంటాం. మనుషుల మద్యన భద్రంగా ఉన్నాయనుకొంటాం. కానీ ఒక వారం క్రితం సింగారాయికొండ లో జరిగిన ఒక సంఘటన ఈ ఆశ కూడా నిరాశ చేసింది. ముగ్గురు సాఫ్ట్ వేర్ అమ్మాయిలు చెన్నై నుంచి విజయవాడ బయలుదేరారు. రైలు ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చింది. రైలు బోగీలో ఆకతాయిలు అల్లరి చేస్తున్నారు. వెకిలి మాటలతో వేదిస్తున్నారు. శరీరాలను వర్ణిస్తున్నారు. అమ్మాయిలు లేచి ఇంకో కంపార్ట్మెంట్ లోకి వెళ్ళాలన్నా అది లింక్ లేని బోగి. దుండగులు మందు సీసాలు పెట్టుకొని తాగారు, వాగుతున్నారు. బోగిల్లో ప్రయాణికులు ఆ తాగిన వాళ్ళకు భయపడి నోరెత్తకుండా కూర్చున్నారని అమ్మాయిలు చెప్తున్నారు. తాగిన వాళ్ళు కిటికీలు, తలుపులు, మిగతా డోర్లు మూసేశారు. అమ్మాయిలు అరిచారు. అప్పుడు బోగిల్లో ఉన్నవాళ్ళు లేచారు. ఈలోగా వాళ్ళలో ఒక అమ్మాయి కదిలే రైల్లో నుంచి దూకేసింది. అప్పుడు అందరు చైన్ లాగారు. సింగారాయికొండ లో ఆగింది. ఆ అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకుపోయారు. ఇదీ కథ. ఇప్పుడు చెప్పు నీహారికా ఆడపిల్లలు అంతమాత్రం దూరం భయం లేకుండా ప్రయాణం చేసె అవకాశం లేదా? వాళ్ళు ఎం చేస్తే బావుండేది? చుట్టూ ఉన్నవాళ్ళు స్పందించి ఆ ముగ్గురిని చితక బాదితే సరిపోయేది కదా? మనుషులు అంత స్తబ్ధతతో ఉంటె ఇలాంటి ప్రమాదాలు జరగవా? ఈ సంగటనతో కళ్ళు తెరవాల్సింది మన చుట్టూ ఉన్న జనం. వాళ్ళ గొంతులో ప్రశ్నించే ధైర్యం.