నీహారికా ,

మా అమ్మ తనని తాను ట్రీట్ చేసుకోదు. తన జీవితం తనది కానట్లుంటుంది. నేనెలా వుండాలా అని భయమేస్తోంది అన్నావు. నీ మనసులోకి సరైన సందేహం వచ్చింది. నువ్వు 16 ఏళ్ళ అమ్మాయిని ఇప్పుడే తెలుసుకో చాలా మంది ఆడవాళ్లు చేసే పొరపాటు ఇది. అందరి అవసరాలు చూస్తారు. అందరికీ కావలిసినవి అమరుస్తారు. వ్యక్తిగత అవసరాలు మరచి పోతారు. చివరికి భోజనం కూడా ఇంట్లో అందరి భోజనాలు స్థిరపెట్టటం సరే. కానీ ఇల్లాలు తన భోజన సమయాన్ని ప్రత్యేకంగా చూసుకోకపోతే నష్టం ఎవరికి ? హడావుడి లేకుండా తాపీగా తినాలి. తినేది ఆస్వాదించాలి. మంచి నీళ్ళైనా ఇతర పానీయాలైన కొద్దిగా విశ్రాంతిగా తీసుకోవాలి. ఇంట్లో ఉన్న ప్రతీ వస్తువు అందరికీ షేర్ చేయాలి. చివరకి తన మనుషులతో ఆలోచనలకు కూడా జీవితం ఎవరికైనా ఒకటే నీహారికా. దాన్ని ఆసాంతం అనుభవించాలి. త్యాగాలతో వ్యక్తిగతాన్ని విస్మరించవద్దు. ఇది మీ అమ్మ గురించే కాదు. ఈ ప్రపంచంలోని ఇళ్ల వాళ్లందరికీ వర్తిస్తుంది. వాళ్ళ శరీరం అందంగా ఉంచుకోవాలి. ఎన్నేళ్లొచ్చినా సౌందర్యం ఆరోగ్యం ఆలోచనలు అన్నీ ఫ్రెష్ గా ఉంచుకోవాలి. సమయం మిగుల్చుకోవాలి. మనసు నిండేంత బాగా చదువుకోవాలి. ప్రతి ఉదయాన్నే ప్రేమగా ఆహ్వానించేంత ఆనందంగా ఉండాలి. మనకి దొరికిన జీవితం సూర్యోదయం సూర్యాస్తమయం మధ్యని గడిచే మాములు గంటలే. కానీ దాన్ని అలంకరించుకునే  బాధ్యత ఎవరిది చెప్పు. ఎవరికివాళ్ళే ప్రతి నిమిషాన్నీ చేతుల్లో పదిలంగా పట్టుకుని పిసినారి లాగా  ఆ నిమిషాన్ని ఖర్చు చేయాలి. ఒక్క క్షణం గుప్పెట్లోనుంచి జారినా తిరిగొస్తుందా ?

Leave a comment