రోనా  మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వ్యాక్సిన్‌ వేయించుకోవడమే కీలకం. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరిస్తూ వైరస్‌ సోకకుండా కాపాడుకోవచ్చు. ఇదే విషయానికి మరింత ప్రచారం కల్పించేలా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన కొండి ప్రియాంక బైక్‌ రైడ్‌ను ఎంచుకుంది. ‘టీకానే మనకున్న అద్భుత ఆయుధం’ అంటూ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం మొదలుపెట్టింది..గతేడాది అక్టోబరులో హైదరాబాద్‌ నుంచి కేదార్‌నాథ్‌ వరకు దాదాపు 4వేల పైచిలుకు కిలోమీటర్లు ఒంటరిగా ద్విచక్రవాహనంపై ప్రయాణించింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే ఇప్పుడీ సుదీర్ఘ ప్రయాణం. కశ్మీర్‌ నుంచి మొదలుపెట్టి జమ్మూ, హరియాణ, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రల మీదుగా హైదరాబాద్‌ చేరుకుంది. మార్గమధ్యంలో తనకు ఎదురైన వారికి టీకా వేయించుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ వచ్చింది ప్రియాంక. అన్ని రాష్ట్రాల్లోనూ హిందీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రత్యేకంగా కృషి చేసి హిందీలో అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంది. ఆడపిల్ల ఒంటరిగా బైక్‌పై వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటే వచ్చే అవాంతరాలు, సమస్యలను తానూ ఎదుర్కొన్నాననీ, కానీ ఎక్కడా అధైర్య పడలేదంటోంది. ‘రైడ్‌ ఫర్‌ ఏ కాజ్‌ – గెట్‌ వ్యాక్సినేటెడ్‌’ అంటూ రైడ్‌ కొనసాగిస్తున్న ఆమె ‘హైదరాబాదీ రైడర్‌ ప్రియా’ పేరుతో య్యూటూబ్‌లో ఆ విశేషాలనూ పంచుకుంటోంది.

 

Leave a comment