సంక్రాంతి శుభాకాంక్షలు. నువ్వు పల్లెటూరు ఎగరావు కనుక ఇంటిముందర సంక్రాంతి ముగ్గులు. నెత్తిన చెంబు చేతిలో తంబూరా మరో చేతిలో చిడతలు నుదుటిపైన తిరునామాలు కాళ్లకు గజ్జెలతో ఇంటిముందు వచ్చే ఆశీస్సులు కురిపిస్తే ఇచ్చిన దోసెడు ధాన్యంతో సంతోషిస్తే సర్వం కృష్ణార్పణమనే హరిదాసుకూ  ఎరగవు. ఏదీ శాశ్వతం కాదు ఏ వైభోగమూ ఎల్లకాలం వుండదు. భోగి తెలుసుకో యోగిలా మసులుకో అన్న మేలుకొలుపుతో భోగిమంటలు ఎలా సంబరంగా జరుపుతారో చూడలేదు. ప్రకృతి చుట్టూ జీవితం నిర్మించుకో. మట్టి కరుణించి గాలి దయదలిచి వర్షం ఆశీస్సులను వర్షిస్తే ఈ పంచభూతాల సాయంతో ధాన్యాన్ని పండించే రైతు  ఆ పంట ఇంటికొచ్చిన క్షణాలను ఆస్వాదిస్తూ కృతజ్ఞతగా తనకు సాయం చేసిన పశువులను పూజించి పిచుకులకు చీమలకు కులవృత్తులతో తనకు సాయం చేసి చేయందించిన సర్వజనులకు కృతజ్ఞతలు చెపుతూ జరుపుకునే ఈ పండుగ విశేషాలు ఈ నాలుగు అక్షరాల్లో నీకు అందించగలనా ? కానీ ఈ  సంప్రదాయాన్ని తీర్మానించి తీరానికి అందించే పెద్దవాళ్ళకి అందుకుని ఆచరిస్తున్న నీలాంటి యువతరానికీ చెప్పలేనన్ని శుభాకాంక్షలు మాత్రం చెప్పేస్తున్నా. పల్లెల నుంచి వచ్చేసినా ఆ మూలాల్ని వదలని ఈ పట్టణ వాసనపు ఇళ్లలోంచి వస్తున్నా అరిసెల వాసన పల్లెదా పట్టాననిదా పెద్ద తేడా లేదంటున్నాయి. మరింకేం. అంతా శుభం అందరికీ శుభం.

Leave a comment