కంటి పైని కునుకు ఇంకా మాయమవ లేదు

సూరీడి జాడ ఇంకా భూమిని తాక లేదు
కొంపలంటుకుపోయినట్లు
మజిలీలు దాటి పోతున్నట్లు
హడావుడిగా
కప్పుకున్న చాదర్ ను పక్కకు తప్పించి
వాలి ఉన్న వెన్నును నిటారు చేసుకుని
ఆవలింతలతో అలవాటుగా
వంటింట్లోకి అడుగుపెడుతుంది

వేరే ప్రపంచమేమీ తెలియనట్లుగా
కీ ఇచ్చిన బొమ్మలా
పోతపోసినట్లుగా
ఒక ఫార్మాట్ లో యంత్రానికి పని అప్పగించినట్లుగా
ఒకదాని తరువాత మరొకటి
పిల్ల కాలువలో నీటి ప్రవాహంలా
అలా కొనసాగుతూనే ఉంటుంది

మర బొమ్మగా మారలేని మనసుని
కొత్తగా
ఇష్టంగా చేయాల్సిన పనులేవో
రారమ్మని తొందర పెడుతుంటాయి

తప్పించలేని పాత పనులు
జిన్న్ లా వెంటాడుతుంటాయి
పనిచేసి పెడితేనే ప్రేమ ఉన్నట్లు చిత్రీకరించిన పాడు సమాజం
నువ్వు గుల్లగా మారుతున్నా కనికరించదు
మనసైన పనులు చేయనీయదు

ఔరత్‌..‌.
మర్దానా రాసిన
INDEX తో ఒదిగిపోవాలి
గుండెల్లో ముల్లు సలపరిస్తున్నా సరే!
దిగులు నీ శరీరాన్ని తినేస్తున్నా సరే!!

– నస్రీన్ ఖాన్

Leave a comment