నీహారికా,

ఈ మధ్య వచ్చిన కొన్ని సర్వేలు తెలుగు రాష్ట్రాల్లో ఇంట్లో పెత్తనం విషయంలో పురుషులదే పై చేయిగా ఉందని వచ్చింది. సరే పెత్తనం వాళ్ళనే ఉంచుకోమనండి అందామంటే ఈ పెత్తనం అర్ధం వింటే గుండె జారిపోవాలి. ఆస్పత్రికి వెళ్ళాలన్నా 88 శాతం మంది మహిళలు ఇంట్లో పెద్దలకు చెప్పే వెళ్ళాలంటారు. ఏది వండాలో పురుషులే నిర్ణయిస్తారని 62శాతం మంది స్త్రీలు చెప్పారట. దేశం మొత్తం మీద 65శాతం మహిళలు చదువుకొంటే అందులో 5 శాతం మంది మహిళలకు మాత్రమే భర్తను ఎంచుకొనే స్వేచ్చ ఉందట. మేరీలాండ్ విశ్వవిద్యాలయం, జాతీయ అనువర్తిత ఆధిక పరిశోధన మండలి సంయుక్తంగా జరిపిన జాతీయ మానవ వనరుల సర్వేలో 34 వేల మందిని ప్రశ్నించి ఈ సర్వే చేశారట. 15 నుంచి 80 ఏళ్ళ మధ్య ఉన్న మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. పక్కన వున్న కిరాణా కొట్టుకు వెళ్ళాలన్నా పర్మిషన్ ఉండాల్సిందే అని 80శాతం మంది మహిళలు చెబితే ఇంకా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలా అర్ధం ఏమిటా అనిపిస్తుంది. కానీ ఒక్కటే ఊరట. ఇంత వివక్ష ఎదుర్కొంటున్నా ముందుకే కదులుతున్నారు నేటి మహిళలు. తనకంటూ గుర్తింపు కోసం అహర్నిశలు కృషి చేస్తూనే వున్నారు. ఎన్నో రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. కానీ వెలుగు వెంట చీకటిలా వాళ్ళని కష్టపెడుతుందీ అసమానత్వం. సంపాదిస్తున్నా నిరాధారంగా ఉన్న మహిళా మహిళగానే వుంటుంది. మరి ఏ వెలుగులు ఈ చీకటిని చీలుస్తాయో భవిష్యత్ చెప్పాలి.

 

Leave a comment