కంటికంటిన నిద్దుర వీడనేలేదు
ఆవలింతలతో కంటి కొసల్లో
ఏకధాటిగా కారే నీటి ధార
కలలను కంచికి చేర్చకుండానే
నిన్నటి రోజు బడలిక తీరకుండానే
నిశ్శబ్దపు చీకటిలో కాంతిపుంజంలా
దూసుకొస్తుంది
సహెర్ కోసం మోగే సైరన్ మేలుకొలుపు
ఆ పిలుపు కోసమే ఎదురుచూసే
ప్రేమామృత హస్తాలు
చకచకా రంగంలోకి దిగుతాయి
ఇంటిలోని రోజ్ దార్ ల కోసం
మరో రోజ్ దార్ పాణీలు చేసే విన్యాసాలు
ఏ కళాకారుడి కుంచెకు ఇంకా చిక్కనేలేదు
వంట ముగిసేలోగా తన బాధ్యతను
గుర్తు చేస్తూ మరోసారి మోగే సైరన్
ఈసారి గాఢ నిద్రలో మునిగి ఉన్న రోజ్ దార్ లందరి మత్తును విడగొడతాయి అవే చేతులు
ఫజర్ నమాజ్ తరువాత సేదతీరుతారు ఆమె తప్ప
తెలతెలవారే తరుణంలో బేరోజ్ దార్ ల కోసం మళ్ళీ కదం తొక్కుతాయి అవే చేతులు
పొద్దెక్కితే రోజు వారీ పనుల్లో మునిగిపోయే అవిశ్రాంత కరములు
కాస్త సమయం చిక్కితే దైవ చింతనలో అలుపెరుగని కృషి చేస్తాయి ఆమె పెదవులు
అల్లాహ్ నామ స్మరణలో మునిగి తేలుతుంది ఆమె మస్తిష్కం
అంతలోనే ముంచుకొచ్చే ఇఫ్తార్ సమయం
మరలా ఇంటిల్లిపాదికీ తీర్చాల్సిన అవసరాలు వరస కడతాయి
చూస్తూండగానే తరుముకొస్తుంది సైరన్
మరలా భోజనం మరలా పానీయాలు
ఇహపరపు సాఫల్యత కోసం ఆమె పడే తపన
అలుపెరుగని రైలులా పరుగెట్టిస్తుంది
ధార్మిక చింతన,
తనఖాతాలో దాచాల్సిన పుణ్యం
తరావీహ్ ల కోసం తపనపెడుతుంది
సేదతీరని దేహం
స్వేదం చిమ్ముతున్నా
ముఖంపై చెదరని చిరునవ్వుతో
రంజాన్ మాసాన్ని ఫలవంతం చేసేందుకు తను కొవ్వొత్తి అవుతుంది
– నస్రీన్ ఖాన్