నీహారికా,

జీవితoలో ఎప్పుడూ దేనికోదానికి భయపడుతూ వుంటాం. కానీ ఆ భయం జాగ్రత్తకు మేలుకొలుపులా వుండాలి కానీ అదే మనల్ని వెంటాడి వేధించకూడదు. జీవితం ఎప్పుడూ ఒక పద్దతిగా వుండదు. హెచ్చుతగ్గులు, మార్పులు, కష్టనష్టాలు, ఆనందాలు ఎన్నో ఉంటాయి. ఈ రోజు రేపు ఇంకోలా అయిపోతూవుంటుంది  అందుకే మనం ఎప్పుడూ మనస్పూర్తిగా రేపును ఆహ్వానిస్తూవుండాలి. మార్పు అంటే భయం లేకుండా ఆ మార్పుని స్వాగతించాలి. నిర్భయంగా జరగవలసిన విషయాన్ని అంగీకరిస్తూ పోతే జీవితానికో ధైర్యం ఉంటుంది. చేస్తే ఏమయిపోతుందో ఎలా పరిణమిస్తుందో, చేయటం తప్పా ఒప్పా అన్న సందిగ్ధ రేఖ దగ్గర నిలబడితే ఏ అనుభూతి అయినా ఎలా అందుతుంది జీవితంలో ఎన్నో సాధించి సమకూర్చుకున్నాక, ఆ పొందిన వాటిని పోగొట్టుకొంటామెమోనన్న భయం అడుగు ముందుకు పడనీయకుండా అడ్డుకుంటుంది. అలాగే వైఫల్యాల భయం కూడా వెంటాడుతుంది. ఇలాంటి నష్టాలు జరగకుండా భయాలన్నీ పక్కనపెట్టి ఓ అడుగు ముందుకు వేయడం విజ్ఞత గలవారి లక్షణం. ఎప్పుడూ మన దృష్టి వెలుగు వైపే ఉంచుకుని, ధైర్యాన్ని రెండు చేతులా అందుకుని అడుగు ముందుకు వేయాలి. జన్మ సాఫల్యత అదే.

Leave a comment