కన్నులు నీవే కాదనను, కలలు నీవి కాదు

పెదవులు నీవే కానీ, నువ్వు అనాలనుకునే వాటికి పనికి రాదు

అడుగులు నీవే నిజమే, నువ్వనుకున్న దారిలో వాటిని నడపలేవు

మనసు నీదే, నీ గురించి మాత్రం ఆలోచించకూడదు

నీకు మోహమాటమే తప్ప ఆత్మాభిమానం పనికిరాదు
దాని వల్ల నీకు పూట కూడా గడవదు కదా

నీ సుఖం, నీ తిండి, నీ నిద్ర, నీ జీవితం గురించి ఆలోచించిన మరుక్షణమే కప్పెట్టెయ్
అవి నీ వినాశనానికి హేతువులు

ముఖ్యంగా, తెలివిగా అస్సలు మాట్లాడకు
అసూయాగ్నికి భస్మం అయిపోతావ్

జీవితంలో ఎదగాలనుందా, వెర్రిపిల్లా!! ఆ ఒక్క ఆశా చాలు
ని కొరివి నువ్వే అంటించుకున్నట్టే

నా మాట విను
అమాయకత్వం, సహనం, ఓపిక, భరించడం ఇవే నీకు తారకమంత్రాలు

ఎందుకంటే, అవి ఉంటే నీ తిండికి ఢోకా లేదు

నీ తోటి ఆడదే బాధపెడుతోందని శపించకు

వారు ఒకప్పటి నేటి నువ్వు లు
నువ్వు రేపటి నేటి వాళ్ళు….

     -మీనా గాయత్రి సూరంపూడి

Leave a comment