నీహారికా, ఈ రోజుల్లో అమ్మాయిలు చదువు కోసం, జాబ్ కోసం హాస్టల్లో లేదా నలుగురైదుగురు స్నేహితులతో కలిసి వుండటం చాలా సహజం. కొన్ని మర్యాదలు పాటిస్తే జీవితం చాలా సాఫీగా గడిచే మాట వాస్తవం. సహజంగా స్నేహితుల షేరింగ్ చాలా అవసరం. ఆహరం, ఆర్ధికం, చదువు, తోడుగా వుండటం ఇలా ఎన్నో విషయాల్లో ఒకళ్ళతో ఒకళ్ళు అండదండలుగా ఉండచ్చు. కానీ ఇది మొహమాటం కోసం ఖచ్చితంగా చేయకూడదు. ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారని అడిగిన వస్తువులు ఇవ్వడం రమ్మంటే సినిమాలకు, షాపింగ్ లకు, షికార్లకు పోవడం నష్టం. ఏ విషయంలో అయినా స్పష్టంగా ఉండాలి. వస్తువులు పంచుకోవడం ఇష్టం లేకపోతే ముందే చెప్పేయాలి. ఏ పరీక్షలకో తయారవుతూ మొహమాటానికి టైమ్ పాస్ చేసేందుకు స్నేహితుల వద్దకువద్దు. కలసి వుండే చోట మన వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగకూడదని అందరూ అనుకుంటే అసలు సమస్యే రాదు.