పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలనుకుంటే అందులో మూడు ముఖ్య విషయాలు కలగలిసి ఉండాలని తల్లితండ్రులు తెలుసుకోవాలి. మెచ్చుకోలు ఒక చిన్న గిఫ్ట్ ఒక పనిష్ మెంట్ ఈ మూడింటిని సరైన సమయంలో ఉపయోగించి పిల్లల్ని జీవితపు విలువలు పాటించేలా ఉత్తమ పౌరులుగా పెంచుకోవచ్చు. ముందుగా వారికీ మనపై నమ్మకం కలిగేలా పెద్దలు ప్రవర్తించాలి . తమ క్షేమం కోరేది తల్లి తండ్రులే నన్న భావన పిల్లల్లో కలిగితే ఒక పెద్ద పని అయినట్లే. అలాగే పిల్లలు మంచి పని చేస్తే తప్పని సరిగా పొగడాలి. ఆ పొగడ్త వారిని మరిన్ని మంచి పనులు చేసేందుకు ప్రోత్సాహం. అలాగే వారిని సంతోషపెట్టే ఒక చిన్న బహుమతి. పిల్లలు ఈ రెండింటితో తమలో ఉండే దుడుకుతనం సగం తగ్గించుకుంటారు. పెద్దలు నచ్చేలా మెలిగి ఆనందపెట్టాలనుకుంటారు. అలాగే ప్రతి చిన్న పొరపాటుని సమర్ధించవద్దు. ఒక చిన్న పొరపాటు చేస్తే అది ఎందుకు తప్పో ఆలా చేయటంవల్ల ఎవరికీ ఎందుకు నష్టమో అసలు తప్పు ఎందుకు చేయకూడదు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పే ఓర్పు నేర్పు తల్లి తండ్రులకు ఉండాలి. అప్పుడు ఇచ్చే ఒక చిన్న శిక్ష పిల్లలో మార్పు తెస్తుంది. ఫలానా కారణంగా నా వల్ల పొరపాటు జరిగిందనీ దాన్ని చేయటం నష్టమనీ తెలుసుకుంటారు. ఇచ్చే శిక్షని మనసులో నిల్చుకుని కష్టం కలిగేలా ప్రవర్తించకుండా వుంటారు. తప్పు చెప్పాలి సరిదిద్దాలి. మందలించాలి. ఆ హక్కు పెద్దలకు ఉందని పిల్లవాడు నమ్మగలగాలి.