దుఃఖాలకు మాత్రమే
కేరాఫ్ గా ఎందుకు చిత్రీకరిస్తుంటారో
హృదయాంతరాలలో వెలిగే
చిన్నపాటి సంతోషాన్ని కూడా
నేను నిశ్శబ్దంగా పంచుకుంటాను
బుగ్గలపై నుంచి కిందకి జారుతూ నీవెప్పుడూ ఏకాకివి కావనే భరోసానిస్తుంటాను
కంటి కొలుకుల్లోంచి
ఊటలా ప్రవహిస్తూ
చేపకూ నీటికీ ఉన్న సాపత్యానికి
ప్రతీకను అవుతాను
ఒక్కోసారి జలపాతంలా
దూకడానికి సిద్ధమంటూ సంకేతాలిస్తూనే
ఊబిలో చిక్కుకున్న కుందేలు పిల్లలా నిస్సహాయంగా
రెండు రెప్పల మధ్యనే సమాధి అవుతూంటాను
కృత్రిమ రాతి అరణ్యాలకు
అలవాటు పడిన ఆధునికులు…
అంతరాల్లో నిక్షిప్తమైన నన్ను మరచి ఒంటరులమనే దిగుళ్ళతో
నడిచొచ్చే శవాల్లా కనిపిస్తుంటే
జాలిపడుతుంటాను
ఎందరి హృదయ భారాలనో
క్షణాల్లో తేలిక చేసే నేను కనిపిస్తే సిగ్గుపడే
మేధావుల ప్రపంచంలో
నేనుండడం గమ్మత్తేమీ కాదు
మాటలుగా వ్యక్తమవలేని జీవులకు
నేనే వాహకాన్ని
నా ద్వారా పలకాల్సిన ఎన్నో భావాలను మాటలుగా మార్చేస్తాడు మనిషి
కానీ
మాట స్వరూపం పెగలాలంటే
నేను ఆలవాలమవాల్సిందే
అందుకే
నా అస్తిత్వ ప్రకటన
గర్వంగా ఆవిష్కరించుకునే దాకా
ఈ రాతి హృదయాల మధ్య
నీటి ఊటనై నిశ్శబ్దంగా సంచరిస్తుంటాను
– నస్రీన్ ఖాన్