రచయిత-రమా సుందరి
అవును. దళిత సమస్యను లిబరల్ బ్రాహ్మణ consciousness నుండి చూసే సినిమానే. ఆ consciousness సానుభూతితో, సహానుభూతితో, నిజాయితీతో ఉంటుంది. కానీ మూలాల్లోకి వెళ్లలేదు. అయినా సరే, దళిత సమస్య తీవ్రతను ప్రజల్లో సెన్సిటైజ్ చేయటానికి ఇలాంటి సినిమాలు అవసరమే.
ఆర్టికల్ 15 సినిమా, హీరోయిక్ వెర్షన్ ను అధిగమించలేనంత కమర్షియల్ సినిమా అయినా, దళిత సమస్య విషయంగా సామాజిక చేతనను పెంచే ప్రయత్నం చేసింది. బాదాన్ అక్కచెల్లళ్ల గాంగ్ రేప్, హత్యా; ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి కాబట్టి, ఇప్పుడు విడుదల అయ్యి కూడా ఈ సినిమా ఎలాంటి వివాదాలు లేకుండా నడుస్తుందన్న మాట కొంత నిజమే అనిపించింది. సినిమా మొదలు ఆదిత్యనాధ్ కు ధన్యవాదాలతో మొదలవడం కూడా యాదృచ్ఛికం కాక పోవచ్చు.
యువతరంలో (ఎక్కువ సినిమాలు చూస్తున్న వాళ్ళలో) వస్తున్న మార్పును పసిగట్టి ఇలాంటి సినిమాలను తీస్తున్నారా అనే అనుమానం వస్తుంది. అందుకనే ఇలాంటి సినిమాలకు ఎన్నో పరిమితులు ఉంటున్నాయి. అంటరానితనాన్ని, కుల వివక్షను, పాకీపని వారల సమస్యను ఒళ్లు గగుర్పాటు పొడిచేటట్లు (డ్రైనేజ్ లోకి దిగిన మాన్యువల్ స్కావెంజర్ ను చూసినపుడు) చూపించటం, వారి పోరాటాలను విఫల పోరాటాలుగా విరమింపచేసి, ఒక అప్పర్ కాస్ట్ పోలీస్ ఆఫీసర్ సహృదయంతో చేసే ఉద్యోగ ధర్మాన్ని గ్లోరిఫై చేసి చూపటంతో ఇలాంటి అనుమానాలు వస్తాయి. దళిత సమూహాలు, వారి వేషబాషలు, ఆ సమస్యలు చూపించటంతో చేసిన సహజత్వ ప్రయత్నం, పోలీస్ ఆఫీసర్ హీరోయిజంను లేకుండా చేయటంలో లేదు. సినిమా చివరలో గౌర, జాతవ్ కౌగలించుకొని ఏడ్చిన ఏడ్పు కళ్లనీళ్లు పెట్టిస్తుంది కానీ, ఈ ఏడుపేనా ఇక మిగిలింది అని కూడా అనిపిస్తుంది. ఈ దళిత సామూహిక శోకం వీళ్లకు మార్కెట్ వస్తువు అయ్యిందా అని కూడా అనిపించింది.
ఒక తీవ్ర గాయాన్నీ బాధనూ చూపించి ఏడిపించి, పరిష్కారాన్ని సూచన మాత్రంగానైనా చెప్పని సినిమా నాలాంటి వాళ్లకు అసంతృప్తిని ఇస్తుంది. అయితే అసలు ఈ సమస్యలు లేఖమాత్రంగానైనా తెలియని వారికి, ఇప్పుడిప్పుడే సమాజంతో సంపర్కం జరుపుతూ అయోమయంగా ఉండే వాళ్లకూ ఈ సినిమా ఉపయోగపడుతుంది.
కొన్ని నచ్చిన డైలాగ్స్ ఉన్నాయి.
అమ్మాయిల శవాలను పోస్ట్ మార్టం చేసి గాంగ్ రేప్, హాంగింగ్ అని రాయబోతున్న యువ డాక్టర్ ను ఉద్దేశించి ‘నీ మనసు కరిగిపోతే ఫేస్ బుక్ లో ఒక కవిత రాసుకో. రిపోర్ట్ లో అలా రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అంటాడు పోలీసు ఆఫీసర్ బ్రహ్మదత్. ఎక్కడో తగిలింది ఈ మాట. మన భావోద్వేగాలను ఫేస్ బుక్ లో పారేసుకొని సంతృప్తి పడిపోతూ కార్యాచరణకు దూరం అవుతున్నామనే స్పృహ మళ్లీ చెళ్లుమన్నది.
ఇంకో దగ్గర
గౌర, నిషాద్ మధ్య ప్రేమను ప్రస్తావిస్తూ ‘నిషాద్ ను చూస్తే గౌర కళ్లల్లో వచ్చే మెరుపు, నీ కళ్లలో నన్ను చూసినపుడు కనపడటం లేదు’ అని అంటాడు హీరో ఆఫీసర్ తన ప్రియురాలితో. ఇది నిజం, ఒక విప్లవకారుడి మీద అదే కార్యాచరణలో ఉండే స్త్రీకి ఉండే ప్రేమకు ఏదీ సరితూగదు.