రచయిత-జ్యోతి.పీ

కొడవటిగంటి కుటుంబరావు గారి నవల “కొత్త కోడలు” మధ్యతరగతి కుటుంబంలోని మనస్తత్వాలను, సంబంధాలను ఆవిష్కరించే రచన. ఇందులో పెళ్ళి అనే బంధం పట్ల ప్రపంచ వైఖిరిని మరో సారి ప్రస్తావిస్తూ దాని ఛుట్టూ అల్లుకుని ఉన్న అంచనాలను, కపటత్వాన్ని ప్రశ్నిస్తారు రచయిత. హనుమాయమ్మ అనే స్త్రీ ఇందులో ముఖ్యమైన పాత్ర. ఆమె రెండవ కుమారుని వివాహం కోసం సంబంధాలు చూడడం, సరోజిని అనే అమ్మాయి తండ్రి వద్దకు ఈ సంబంధం వెళ్ళడం అది విని సరోజిని స్వయంగా తాను పెళ్ళాడబోయే ఇంటీ పరిస్థితులు తెలుసుకోవడానికి రావడం ఈ నవలలో ముఖ్యమైన విషయం. అయితే ఈ కొత్త కోడలి పోకడ, చొరవ అందరికీ నచ్చుతాయి. కాని హనుమాయమ్మ ఈ అమ్మాయిని తన కోడలిగా ఒప్పుకోలేకపోతుంది. ఈ పెళ్ళి ఆపు చేయాలను ఎన్నో విధాల ప్రయత్నిస్తుంది. కాని ఇంట్లో అందరూ సరోజినీ ని ఇష్టపడినందువల్ల హనుమాయమ్మ ప్రసక్తి లేకుండా వివాహం జరిగిపోతుంది. ఈ నవలలో పెళ్ళి అనే చట్రం ద్వారా తన ఆధిపథ్యాన్ని చాటాలని ప్రయత్నించే ఒక స్త్రీ పాత్రను అత్తగారి పాత్ర ద్వారా చూపించడం జరిగింది.

పెళ్ళీ చుట్టూ ఎన్నో లావాదేవీలు, వ్యాపార సంబంధాలు, స్వార్ధాలు దాగి ఉన్నా రచయిత వాటిని ఎత్తి చూపాలని ప్రయత్నం చేస్తున్నారని అర్ధం అవుతున్నా ఎందుకో “కొత్త కోడలు” నవల లో హనుమాయమ్మ పాత్ర పట్ల నాకు ఎంతో అన్యాయం జరిగిన ఫీలింగ్. అసలు సంసారం అనే చట్రంలో పడి స్త్రి ఎంత చిన్నజీవితం గడుపుతుందో ఎంత మురికి వ్యక్తిత్వాన్ని సొంతం చేస్ఝుకుంటుందో ఈ పాత్ర ద్వారా అర్ధం అవుతుంది. అయితే ఇటువంటీ స్త్రీ ల వల్ల లాభ పడినన్నిరోజులు కుటుంబ సభ్యులు వీరిని ఉపయోగించుకుంటారు. హనుమాయమ్మ ప్రపంచం ఆ చిన్న ఇల్లు, తన భర్త, తన పిల్లలు తన చెప్పు చేతుల్లో ఉండాలనే కోరిక తప్ప, దాని కోసం బండెడు చాకిరీ చేయడం తప్ప మరో టి తెలియని ఇల్లాలు ఆమే. అదే సాంప్రదాయం అనే చట్రంలో బ్రతుకుతున్న ఒక ప్రాణి. ఆమె ని అలా మార్చిన సంసారంలోని వ్యక్తులే తరువాత ఆధునిక పంధాలో తమ జీవితానికి ఆమె అడ్డు అని ఆమెని దులపరించే విధానం, ఆమెను పక్కకు పెట్టీ ముందుకు వెళ్ళే విధానం చూస్తే రచయిత ఈ పాత్రకు అన్యాయం చెసాడేమో అనిపించింది.

హనుమాయమ్మ ను అందరూ ద్వేషిస్తారు. ఆమె భర్త, పిల్లలతో సహా, ఆమె చిన్న మనస్థత్వం వారికి అసహ్యం కలిగిస్తుంది. కాని సంసారం అనే ఆ చట్రంలో స్త్రీలు అలా కాక మరోలా ఎలా తయారు అవుతారు. ఈ నవలలో హనుమాయమ్మ వంటీ స్త్రీల పట్ల ఆధునిక యువతరానికున్న ద్వేషం కనపడింది కాని హనుమాయమ్మలను తయారు చేస్తున్న సంసార పరిస్థితుల పట్ల పెద్దగా పాఠకుల దృష్టి పడకుండా రచయిత కథ నడిపించడం నాకు నచ్చలేదు. పిల్లలకు పెళ్ళిల్లు కావాలి, వచ్చే కోడళ్ళూ తనకు అనుకూలంగా ఉండాలి అనే ఒక పిచ్చి కోరిక హనుమాయమ్మ వంటి స్థీలకు ఉండిపోవడానికి కారణం, తన పిల్లలు తన భర్త తన ఆధిపత్యంలో ఉన్నంత వరకే తనకు మనుగడ అనే భావాన్ని స్త్రీలలో నింపే వ్యవస్థ కాదా. కొడుకు పెళ్ళీ అయ్యి కోడలు తన ఇంటీకి వచ్చి తన సామ్రాజ్యాన్ని పంచుకుంటుంది అనే భయం లో నుండి వచ్చిన ఇన్సెక్యూరిటీ ఆడవారిని ఎంత అవివేకులుగా కొన్ని సార్లు క్రూరులుగా మారుస్తుందో తెలిసి రచయిత ఇందులో హనుమాయమ్మ పాత్రను సృష్టించి, దాన్ని నలుగురు ద్వేషించే పద్దతిలో రాయడం వల్ల ఈ నవల నాకు నచ్చలేదు. కొన్ని సార్లు నాకు అనిపిస్తుంది, పురుషులు స్త్రీ ల వైపు నుండి ఆలోచించాలంటే చాలా కష్టమేమో అని. కో. కు గారు ఒక పురుషుని మేధస్సుతో ఈ నవల రచించారు కాని స్త్రీ వైపు నుండి చూస్తే ఈ నవల మరోలా వచ్చేదేమో. హనుమాయమ్మ విలన్ లా కాక ఒక విక్టిమ్ గా కనిపించేదేమో.

లోకంలో హనుమాయమ్మలు ఉన్నారు. అయితే వారిని, వారి ఇన్సెక్యూరిటిని కుటుంబం కొంత వరకు తమకు అనుకూలంగా ఉన్నంత వరకూ ఉపయోగించుకుంటుంది. అదే సాంప్రదాయవాదం తమ స్వాతంత్రానికి చేటు అని అనుకున్నప్పుడు హనుమాయమ్మలను విలన్లుగా ఆ కుటుంబమే సృష్టిస్తుంది. “ఎవరు ఎక్కడికి వెళ్ళీనది, ఏం పనుల మీద వెళ్ళినదీ ఆవిడకు తెలీనప్పుడల్లా జీవితం ఆవిడ గుప్పిట్లోంచి జారిపోతున్నట్లనిపించే” హనుమాయమ్మ తన భర్త కాకపోతే తన పిల్లలు తనను అంటిపెట్టూకుని ఉండాలని కోరుకోవడం, దాని కోసం కోడళ్ళతో యుద్దం చేయడం, ఆమే అభద్రతా భావానికి, సంసారంలో బంధాలు తప్ప స్త్రీ జీవితంలో గెలిచే మరో పరిధి సమాజంలో లేదనే ఒక భావనలో బ్రతికే కోట్లాది స్థ్రీల ఆలోచన కి ప్రతిరూపం. ఆ భర్త దెప్పులతో కాలం గడుపుతూ, పనిపిల్లని పెడితే ఖర్చు అని చాకిరీ చేస్తూ, పిల్లలు తమ సౌకర్యాల కోసం ఖర్చు పెడుతుంటే దుబారా అని వాపోతూ, కోడళ్ళూ కొడుకులను తమ వైపుకు లాక్కున్నారనే దుఖంతో కరిగిపోతూ ఆఖరికీ తనని లెక్క చేయకుండా ఇంటిల్లిపాదీ కొత్త కోడలిని తెచ్చుకున్నాక కూడా ఆ పెళ్ళి ద్వారా వచ్చే చుట్టరికంతో తన కూతురికి మంచి సంబంధం వస్తుందని ఆశపడి లేకీగా వారి వద్ద బయటపడిపోవడం చూస్తే నాకు హనుమాయమ్మల పట్ల జాలి కలిగింది. వీరిని ఇలా మార్చి మళ్ళీ వీరినే తప్పు పట్టే వ్యవస్థ మీద కోపం వచ్చింది. హనుమాయమ్మల పట్ల ద్వేషం కలిగించే విధంగా వచ్చిన కో.కు గారి ఈ నవల స్త్రీలను ఇలా తయారు చేసే వ్యవస్థ వైపుకు పాఠకుల దృష్టిని మళ్ళించలేదే అని భాధ కలిగింది. కో.కు. గారి రచనలను విమర్శించే అంత దాన్ని కాదు కాని ఈ నవల మాత్రం నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది. స్త్రీ ల మనస్థత్వాలను అర్ధం చేసుకున్న గొప్ప రచయిత గా కో.కు ను ప్రస్తావిస్తారు తెలుగు విమర్శకులు. వీరే హనుమాయమ్మలను అర్ధం చేసుకోలేదే అనీ బాధ మాత్రం ఉండిపోయింది.

Leave a comment