నీహారికా ….
చక్కని మాటలు అద్భుతమైన ఒక రోజు గడిచిపోతూ తీయతీయగా కొత్త సంవత్సరం వచ్చేసిందీ అన్నావు. మాటలు అద్భుతాలు చేస్తాయి. ఉదాహరణకు నాకు ఇంగ్లీష్ రాదు అని పదిసార్లు అన్నామనుకో ఇంకంతే … ఆ నెగిటివ్ ఫీలింగ్ మన చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. అదే రోజుకో పది కొత్త మాటలు నేర్చుకుంటూ ఒక సంవత్సరం నిష్టగా అభ్యాసం చేస్తే ఇంగ్లీష్ భాషే మన సొంతం అవుతుంది. రాదు చేయను కష్టం నావల్ల ఏమవుతుంది లాంటి నెగిటివ్ సజెషన్స్ ఇచ్చుకునేకూడదు. భవిష్యత్తు పైన విశ్వాసం లేకపోతేనే అలంటి మాటలొస్తాయి. ఎవరైనా ఎలా ఉన్నవని అడిగితే గ్రేట్ ఎక్స్లెంట్ హ్యాపీ అంటూ మనస్ఫూర్తిగా చెప్పామనుకో మన మనసు వాటిని అంగీకరించి ఆమోదం చెపుతుంది. మనకు తెలియకుండా ఆ ప్రభావం మనసు పైన పడుతుంది. అవే నమ్మకాలవుతాయి .మొత్తం మన బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెంట్ గా మారిపోతుంది. దాన్ని బట్టి సత్ఫలితాలుంటాయి. ఇందాక అన్నావే .. ఎన్ని అద్భుతమైన ఉదయాలు. ఎన్ని పూలు వికసించాయి . ఎంత మంది చిరునవ్వుతో మనల్ని పలకరించారు? ప్రకృతి అందించిన ఎన్ని కమ్మని ఫలాల్లో ఒక ముక్క మన నోటికిచేరింది. మనకి దొరికిన ఎన్నింటిని మనం మన చుట్టూ చేరిన వాళ్ళకి ఇవ్వగలిగాం. ఎన్ని చల్లని చూపుల దీవెనలు దక్కాయి. ఇవన్నింటినీ పదిలంగా పట్టుకుని కొత్త సంవత్సరం వైపు చూస్తుంటే ఎంత బావుందీ ? జీవితమా నువ్వెంత విలువైనదానివి !