నీహారికా ,
ఒక విషయం గమనించావా మనం సాధారణంగా పలకరించుకొనేప్పుడు బావున్నారా ? అంటాం. అంటే ఏమిటి మీరు సంతోషంగా ఉన్నారా ? జీవితం బాగా నడుస్తోందా అని. ఇప్పడూ చూడు సంతోషంగా అంటే సంతోషాన్ని ఎలా కొలిచి చెపుతాం ? ఈ లెక్కన మన భావాల్ని మనం ఎవరిపట్ల ఎంత ప్రేమగా ఎంత కోపంగా ఎంత ద్వేషంగా ఉన్నామో చెప్పగలమా ? మన మనస్థితిని నిర్ణయించేది మన దృక్పధం. పెద్దవాళ్ళు ఏమని చెప్తారంటే ప్రతి క్షణం మనం ఉన్న నిమిషం అంతా సంతోషమనీ సంతోషంగానే ఉండాలనీ దానికి దారి ఇతరులను సంతోష పెట్టటమనీ అంటారు . ప్రపంచంలో ఉత్తమమైంది ఆనందమే. నేనేదో ధర్మ సూత్రాలు చెపుతున్నానుకోకు. మనం ఓ పాపాయి దగ్గరకు వెళ్తాం. పసివాడు మొదట్లో మన వంక సందేహంగా చూస్తాడు . వాడిలో మాట్లాడే మార్గం చిరునవ్వు. ఆ నవ్వు మనస్ఫూర్తిగా మానమొహాన కనిపిస్తేనే అందులో నువ్వు నాకెంతో ఇష్టం నీకోసం నవ్వుతున్నాను నీకోసం నిన్నుహత్తు కోవటం కోసం చేతులు జాస్తున్నాను. అన్న మెసేజ్ పసిబిడ్డకు అందితేనే వాడు నవ్విచేతుల్లోకి దూరుతాడు . లేకపోతే నీ నవ్వులు నాకు తెలుసులే అన్నట్లు వాళ్ళ అమ్మ భుజం మీదనుంచి మొహం వెనక్కి తిప్పుకుంటాడు . అదీ సంతోష ఆనంద భాష. అది ఉత్తుంగ తరగంగా ఎగసిపడుతుంది. రారమ్మంటుంది. ఎగసిపడే కెరటాలు దాటి సముద్రంలోతులకు వెళితే ప్రశాంతంగా ఉంటుంది. ఇదే సంతోషం ఆనందం . దీన్ని మనం మాత్రమే పంచగలం ఒక్క చిరునవ్వుతో ఏమంటావు??