లాక్ డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకున్నారు ఎందరో సినీ స్టార్స్. పెరటి తోటలు పెంచుతూ తోటి వాళ్ళకు చాలెంజ్ విసురుతూ హడావుడి చేశారు . ఒత్తిడిని తగ్గించుకోవటం, ఇటు ఆరోగ్య లాభం రెండు పొందారు. ముందుగా సమంత ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంది. వ్యాయామం గురించి ఆరోగ్యం గురించి ఆమె పెట్టే పోస్ట్ లకు లక్షలకొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. లాక్ డౌన్ లో సేంద్రియ పద్ధతిలో ఇంటికి కావలసిన ముల్లంగి, క్యారెట్ క్యాబేజీ, బ్రోకలీ, పాలకూర, లెట్యూస్ మొదలైనవి హైడ్రోఫోనిక్స్ విధానం లో పెంచుతూ ఈ ఇంటి పంట ఒక ఉద్యమం లాగా ‘గ్రో విత్ మీ’ పేరుతో ప్రచారమే నిర్వహించింది. పైగా రకుల్ ప్రీత్ సింగ్ కు ఛాలెంజ్ విసిరింది. దీన్ని అందుకుని రకుల్ ప్రీత్ సింగ్ మిద్దె తోట సాగు మొదలు పెట్టింది. ఇది గొప్ప అనుభూతి విత్తనాలు వేయటం నుంచి, పంట కోసే వరకు ప్రతి దశలో ఎంతో సంతోషాన్ని పొందానని ఇంస్టాగ్రామ్ లో ఎన్నో ఫోటోలు షేర్ చేసింది రకుల్. మనం ప్రకృతిలో మమేకం అయితేనే ఆరోగ్యంగా ఉంటామని చెబుతోంది . బాలీవుడ్ నటి సమీరా రెడ్డి గోవా లోని తన ఇంటి ఆవరణలో కూరగాయల సాగు చేస్తోంది కొడుకుతో పాటు తోట పనులు చేస్తూ ఇన్ స్టా వేదికగా తన సంతోషం పంచుతోంది . సుహాసిని మణిరత్నం కూడా హైడ్రోపోనిక్ విధానంతో మిద్దె తోట పెంపకం మొదలు పెట్టింది. పాలకూర, గోంగూర, కొత్తిమీర తో పాటు అన్ని రకాల కూరగాయలు పెంచుతూ తన మిద్దె సాగు వీడియోలు పోస్ట్ చేస్తోంది. ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్, మోహన్ లాల్ వంటి నటులు వ్యవసాయ తోటపని ఇష్టమని చెబుతూ స్వయంగా ఫామ్ హౌస్ ల్లోనే కాపురం పెట్టేశారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించే వెండితెర వేల్పులు ఎంతోమంది స్ఫూర్తే కదా !