వంటరి నడకతో అలసిపోయిందేమో
60 ఏళ్ళకి ఆగిపోయింది
ఎక్కడానికి శిఖరాలేమీ లేవేమో
శిఖరాగ్రాన సెలవు తీసుకుంది
కోట్లాది మంది కన్నీరు తోడుగా
కోమల వల్లి వెళ్ళిపోయింది
బడుగు జనాల పాలిటి దేవతగా అందరి అమ్మగా ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న సంక్షేమ సారధి అమ్మా అమ్మా అంటి లక్షలాది మంది అభిమానులు గుండెలు బాదుకుంటూ రోదిస్తుండగా పురుచ్చి తలైవి జయలలిత వెళ్ళిపోయింది. పట్టుదల ఆత్మవిశ్వాసం దృఢత్వం కలగలిసిన వ్యక్తిత్వం ఆమెది. మనువాడ ప్రపంచంలో మనుగడ నిలుపుకోవటమే కాదు తమిళనాడులోని ధీర లాగా పాలించారామె. సిమిగరేవాల్ కు ఇచ్చిన ఒక టీవీ ఇంటర్వ్యూ లో మీ జీవితం ప్రతిమూలా ఎన్నో రూమర్స్ వినిపిస్తాయి మీ పర్సనల్ లైఫ్ గురించి మీరు ఏం చెపుతారు అని అడిగితే ఆమె చాల బోల్డ్ గా సమాధానం ఇచ్చారు. నా జీవితం ఒక తెరచిన పుస్తకం. ఎంజీఆర్ ని నేను అందరిలాగే నేనూ ప్రేమించాను. లీగల్ రిలేషన్ షిప్ మా మధ్య లేదు. నా మనసులో ఆ సమయంతో లేచిన జ్వాల తోనే నేను ఆయినా వారసురాలిగా ప్రకటించుకున్నాను. పాలిటిక్స్ లోకి వచ్చాను. భారతీయ సంస్కృతిలో ఒక బాలిక కూతురిగా పుట్టి భార్య హోదా పొంది తల్లి హోదా లో మరణిస్తుంది. నేనెవరికీ భార్యను కాలేకపోవచ్చు. డెఫినెట్ గా తల్లిగా మరణిస్తానన్నారామె. అలాగే నేనేత ఇచ్చానో అంతా బదులు తీర్చుకుంటానని తనకు జరిగిన అన్యాయం అవమానం గురించి చెప్పారు. తనకు అణగదొక్కిన ప్రపంచం పై ఆమెకు కోపం వచ్చే ఉంటుంది. అందుకే సాష్టాంగ నమస్కారాలు అంతులేని విధేయతను ఆనందించారు.
మృదువుగా వుండే నాయికా పాత్రలో ఒదిగిన జయలలిత తనలోని నటిని వెనక్కి తోసి నాయకురాలయ్యారు. అలాగే రాజకీయ జీవితంలో తిరుగులేని స్థానం సంపాదించాక నాయకురాలి వెనక్కి తోసి విప్లవ నాయకి బిరుదుని వదిలేసి అమ్మగా ఆదరించే దేవతగా నిలబడ్డారు. రెండు చేతులా ఆమె అందించిన సంక్షేమ పథకాలతో ఆమెకు అన్ని వర్గాలు నీరాజనం పట్టాయి. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ద్రావిడ పార్టీలకు జయలలిత వంటి బ్రాహ్మణ స్త్రీ నాయకత్వం వహించిందీ అంటే రాజకీయాల్లో ఆమె ఎంత కఠినమైన నిర్దాక్షణ్యమైన నేతగా రూపం మార్చుకుందో తెలుస్తుంది. సొంత కుటుంబం అంటూ లేదు జయలలిత తమిళనాడు ప్రజలందరికీ అమ్మ అయిందని నిరూపించేందుకు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించికొనేందుకు ఆమెకు చివరివీడ్కోలు పలికేందుకు మెరీనా బీచ్ లో హాజరైన జన సందోహంమే నిదర్శనం. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఆమెదో ప్రత్యేక అధ్యాయం.
వెండి తేర నేలిన ఈ ఒకనాటి తార
అఖండ జ్యోతిగా వెలిగేందుకు ఆకాశానికి చేరింది
పది కోట్ల మంది తమిళ ప్రజల
అమ్మ అన్న పిలుపుకి అందనంత దూరoవెళ్లిపోయింది.