నీహారికా,

మనం శరీరానికి పనికి వచ్చే ఎన్నో విటమిన్స్ గురించి తెలుసుకొన్నాం. మరి విటమిన్ M గురించి తెలుసా. ఇది లేకపోతే జీవితo ఒక్క అడుగు కూడా కదలదు. ఆరోగ్యం, ఆనందం, అందం ఏదైనా సరే M వుంటేనే. చదువుకోవాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే, మంచి జీవితం కావాలంటే విటమిన్ M.  ఇది కొంతమంది దగ్గరే పదిలంగా ఉంది. వాళ్ళని కోటీశ్వరులు అంటారు. మిగతా వాళ్ళు వాళ్ళని చూసి అసూయ పడతారు. కానీ నువ్వు ఈ విటమిన్ విలువ తెలుసుకో చాలు. దుబారా అన్న పదం దగ్గరగా ఈ విటమిన్ M వుండదు. డబ్బు సంపాదించాలి. కూడబెట్టి తర్వాత తరాలకు ఇవ్వడం కోసం కాదు. తర్వాత తరాలకు ఎలా సంపాదించుకోవాలో, జీవితం ఎలా వుంటుందో చెప్పాలి. అంటే పిల్లలకు డబ్బు విలువ నేర్పి, వాళ్ళు దాన్ని సక్రమంగా వాడుకొనేలా దారి చూపాలి. 15 సంవత్సరాలు నిండకుండానే సెల్ ఫోన్స్, టూవీలర్స్ వీలయితే కార్లు, పర్సు నిండా డబ్బు ఇచ్చి వాళ్ళను పనికిమాలిన వాళ్ళుగా తయారు చేయకూడదు. డబ్బు చాలా ముఖ్యం, అవసరం కానీ అదే జీవితం ఎప్పుడూ కాదు. ఒక పిల్లవాడు కష్టపడి ఒక క్లిష్టమైన లెక్కను రెండు గంటలు బుర్రకు పదును పెట్టి సాల్వ్ చేయగలిగితే కలిగే సంతోషం వంటిది వాడి చేతికి కష్టం లేకుండా వచ్చిపడిన పాకెట్ మనీ ఇవ్వరు. వాడు పెరిగి పెద్దవాడై, వాడి కాళ్ళపైన వాడు నిలబడి వాడి ఉపాధి వాడు సంపాదించుకోవాలి. వాడికి విటమిన్ M అలా అందాలి. అప్పుడే అది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

Leave a comment