“BETWEEN THE LINES …. the laws of relationships! ( Drama review)
“To read between the lines”………..అంటే to find meanings that are intended but that are not directly expressed in something said or written:
ఆచ్ఛాదిత, అదృశ్య భావావేశాలు! చెప్పకనే చెప్పే ఉద్దేశ్యపూరితాలు! దృశ్యాదృశ్య విభాజకాలు!
నగరీకరణ నుంచి ప్రపంచీకరణకు మనిషి ఉత్థానమైనా…. మారని అంతర్లీనపు అభిజాత్యం, పురుషహంకారం, కనిపించని తెరల వెనక దాంపత్యపు ఆధిపత్యపోరు. మౌలికం, మౌఖికం మధ్య లోయల వ్యత్యాసం!
సమాజంలో అంతర్వాహినిలా కలిసిపోయిన Gender inequality గురించి మాట్లాడడానికి Flag Flying Feminists కావక్కరలేదు. మన కళ్లముందు నడయాడే నాటకమే అదంతా!
స్త్రీ, పురుషులు ఎంత చదువుకున్నా, ఎంత cultured అయినా ఎలా condition అయిపోయామంటే….. భార్యని తమకన్నా కనీసం ఒక సెంటీమీటరయినా కింద ఉంచుతున్న భర్తలకూ అది తప్పని తెలీదు, అలాంటి స్పృహ భార్యలకూ ఉండదు. అంతా చాలా సహజంగా ఇల్లూ, పిల్లలూ… ఆ తరువాతే కెరియర్ గా స్త్రీ, ఉద్యోగం, సంపాదనా, హోదా…. తరువాతే సంసారంగా మగవారూ tune అయిపోయాం. స్థూలంగా ఏదీ తప్పు కాదు. సూక్ష్మంగా చూస్తే బోలెడు లోపాలు ఈ దృక్పధంలో!
అలాంటి ఒక Urban couple’s story …. ” Between the lines”.. ఒక గంట నిడివి ఉండే డ్రామా Hot star లో దొరికింది. 2014 లో నందితాదాస్, ఆమె భర్త సుబోధ్ మస్కారా భార్యాభర్తలుగా నటించిన ద్విపాత్రాభినయం(?)! రచన Divya Jagdale!
మాయా, శేఖర్ లాయర్ దంపతులు. లా కాలేజ్ లో ప్రేమాయణం, పదేళ్ల అన్యోన్యదాంపత్యం! హాస్టల్ కు పంపబడ్డ కొడుకు అర్జున్!
శేఖర్ అపజయమన్నది తెలీని ప్రముఖ క్రిమినల్ లాయర్. మాయ తన ఇంటిబాధ్యతలకు అడ్డురాని వెసులుపాటి ఉద్యోగం… ఒక Law firm లో కాంట్రాక్ట్స్ draft చెయ్యడం, depositions తీసుకోడం…. !
అనుక్షణం భర్త శేఖర్ విజయాలు ఆస్వాదిస్తూ, అతని గురించి అచ్చయిన న్యూస్ పేపర్ clippings దాచి, అతను కేస్ గెలిచిన సందర్భాన్ని గర్వంగా కొడుకుతో, స్నేహితులతో పంచుకుంటూ….. ” మన పక్కన ఒక winner” ఉంటే ఆ విక్టరీ మనదే, మనమూ విన్నర్సే”…. అంటూ సహృదయంతో పొంగిపోయే అల్పసంతోషి.
శేఖర్ చెడ్డవాడు కాడు. కానీ తన విజయపరంపరలో భార్యనో చిన్న భాగంగా చూసుకుంటూ సాగిపోయే లౌక్యుడు. భార్యను చాలా ప్రేమించే భర్త!
ప్రతీ కథకు మలుపో, ముగింపో ఉండాలి కదా! వీరి మలుపు కవిత, ముఖేష్ రూపంలో వస్తుంది. ( ఈ రెండు పాత్రలూ నందితా, సుభోద్ వెయ్యడం కొసమెరుపు)
ముఖేష్ ప్రముఖపత్రికా సంపాదకుడు. కవిత అతని గ్రామీణనేపథ్యం నుండి వచ్చిన భార్య. ఒక విద్యాధికుడయ్యుండి ముఖేష్ భార్యను విపరీతమైన గృహహింసకు గురిచేస్తూ ఉంటాడు. భర్తను చూస్తేనే గజగజలాడే కవిత, ఒకరోజు భర్తపై అతని తుపాకీతో హత్యాప్రయత్నం చేసిందనే అభియోగంతో అరెస్ట్ కాబడుతుంది.
కవిత దీనగాధ మాయను వెంటాడుతుంటుంది. చివరకు తనే తన కెరియర్ లోనే మొట్టమొదటిసారి క్రిమినల్ కేస్ కోర్టులో వాదించడానికి సిద్ధపడుతుంది. అనుకోకుండా ఒక బడా రాజకీయనాయకుడి అభ్యర్ధన మేరకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ముఖేష్ కేస్ శేఖర్ కు అప్పచెప్పబడుతుంది.
” అసలు నీకేమొచ్చని కేసు వాదిస్తావ్?” అంటాడు శేఖర్ మాయను. నా భార్యను కోర్ట్ లో ” My learned Friend” అని సంబోధించాలా! అని అహంగా అనుకుంటాడు. ” నాతో నువ్వు ఓడిపోవడం చూడలేను” అంటాడు. కవితలాగే domestic violence పడుతున్నామని భర్తలను చంపుకుంటూ పోతే ఇక చట్టాలెందుకు? తనకు కఠినశిక్ష పడాలంటాడు. కోర్ట్ లో కూడా కవితను తన మాటలశరాఘాతాలతో భయభీతను చేస్తుంటాడు.
మాయ కళ్లముందు ఇదివరకటిలా ఇల్లూ, భర్తా, కొడుకు ప్రయారిటీస్ మాయమయి తన కేసొక్కటే ముఖ్యంగా ఆడుతోంది. భార్యను కొట్టడం, వేడి టీలు మొహానపొయ్యడం, ఇస్త్రీ పెట్టితో కాల్చడం వంటివి చాలా ఇళ్లలో మామూలే అన్నట్టు మాట్లాడుతున్న ముఖేష్…., “చదువు సంధ్యాలేని మూర్ఖపు కవితతో విద్యాధికుడయిన ముఖేష్ ఎలా బతుకుతున్నాడో పాపం… “…అంటున్న భర్త శేఖర్…. మాయ కళ్లపొరలను కరిగిస్తున్నారు.
భార్యభర్తల ప్రశాంత జీవితంలో ఈ కేసు చాలా తెరలను దింపుతుంది, చాలా తెరలను పైకెత్తుతుంది. మెల్లమెల్లగా కవితజీవితం తనకో ” అద్దం” లా కనిపిస్తూ తన కవిత ప్రతిబింబంలా భావించుకుంటూ తనని తను కవితతో రిలేట్ చేసుకుంటోంది మాయ.
ముఖేష్ లా కొట్టీ తిట్టే భర్త కాకపోవచ్చు. కానీ సెక్సిజమ్ అణువణువునా చూపించే వ్యక్తి. తమతో పార్టీకొచ్చిన స్త్రీల అందచందాలు బాహాటంగా భార్యతో మాట్లాడతాడు. ఇతరుల ఆలోచనలలో పదును నచ్చదు! భార్య జీవితం తన చుట్టూనే అల్లుకుని ఉండాలనే కనిపించని శాసనం. భార్యను గోల్డ్ మెడలిస్ట్ వి అంటూనే… తనను మించకుండా కండిషన్ చేసే నేర్పు.
ముఖేష్ వూళ్లో లేనప్పుడు తనకు రోజులతరబడి ఆహారం ఉండదని కవిత అన్నపుడు….. తనుకూడా భర్తలేనప్పుడు అభోజనంగా గడిపిన సమయాలు గుర్తుకొస్తాయి మాయకు. శేఖర్ తమ ముందు కేక్ ముక్కలు పెట్టి… పెద్ద ముక్క తను తీసుకుంటాడు. చిన్నముక్క మాయకు వదులుతాడు. మాయ అది ప్రస్థావిస్తే…. శేఖర్ మాయను ఆ కేసు వలన తన మనసంతా కలుషితమయ్యి .. ఉన్నవీ లేనివీ సృష్టించుకుంటోందని తిడతాడు.
మాయకు మాయవిడతున్నట్టు ఉంటుంది. కొడుకు అర్జున్ అడిగే చిన్న చిన్న సందేహాలకు జవాబులు చెప్పడం తనకెంతో బాగుండేది. వాడికిష్టమైన బ్రౌనీస్ చేసిపెట్టడం, కధలు చెప్పడం…. ఇవన్నీ. కానీ అర్జున్ ఇప్పుడు బోర్డింగ్ స్కూల్ లో! ఎందుకు అంటే… మనకోసం, మన కెరీర్ల కోసం అంటాడు శేఖర్. నిజానికి “తన ” ఉద్దేశాలను ” మన” ఉద్దేశాలుగా చూపించి అది మంచిదే అని తను convince అయిపోవడం… ఇదంతా శేఖర్ నేర్పుగా చేసే వంచనగా భావిస్తుంది ఆమె. తన పనుల ” Juggling” లో , తన ” Tight rope walk” లో కొడుకు ఆఖరి ప్రయారిటీగా మారాడని దుఃఖపడుతుంది.
శేఖర్ ఆమె emotional intensity ని control చెయ్యడానికి neck massage చేస్తున్నా ఆమె అతని male ego ను, chauvinism ను గురించి దెప్పుతూనే ఉంటుంది. విసికిపోయిన శేఖర్ ఆమె చెయ్యి మెలితిప్పుతాడు కోపంగా. ” అదిగో! నీకూ, ఆ ముఖేష్ కూ తేడాలేదు. నువ్వూ మగాడివే కదా”… అంటూ మరింత రెచ్చగొడుతుంది.
ఇంత శతృత్వభావనల మధ్య మాయ కేసు గెలుస్తుంది.
కవిత.. ముఖేష్ పెట్టే బాధలు తట్టుకోలేక ఆత్మహత్యే శరణ్యమని భావించి…తనను తాను కాల్చుకునే ప్రయత్నంలో ముఖేష్ కు గుండుతగిలి గాయపడ్డాడని …. తన బలమైన వాదన వినిపిస్తుంది మాయ.
కవిత విడుదలవుతుంది. ప్రశంసల పరంపర, విలేఖరుల ఇంటర్వ్యూల తరువాత ఇంటికి వచ్చేసరికి , పరాజయపు అవమానంతో, శేఖర్! స్నేహితులు పంపిన పూలతో నిలబడ్డ భార్యను కనీసం మెచ్చుకోడం కాదుకదా పలకరించడం కూడా చెయ్యడు.
మాయకు తను శేఖర్ కేస్ గెలిచినప్పుడల్లా ఇద్దరూ కలిసి కొడుక్కు చెప్పి celebrate చేసుకున్న మూమెంట్స్ గుర్తొస్తాయి.
అప్పుడే కాల్ చేసిన అర్జున్ కు తన జీవితంలో మొట్టమొదటి కేస్ గెలిచానని చెప్తుంది. Against whom…. అన్న ప్రశ్నకు జవాబు చెప్పదు. అదే స్త్రీ మౌలిక తత్వం. భర్తను loser గా ఎప్పుడూ project చెయ్యని గొప్పతనం.
అతని ఓటమి కూడా ఆమే భరించాలన్న అతని దూకుడు ఆమెకు ఆగ్రహంగా మారుతుంది. తమ కుటుంబ స్నేహితుడితో పార్టీకి వెళ్తున్నానని బయటకు వెళ్లిపోతుంది.
శేఖర్ లో అంతర్మధనం మొదలవుతుంది. భార్యగెలుపుకు తనెందుకంత restless అయిపోతున్నాడో అర్ధమవక.
ఇంతలో కవిత వారింటికి వస్తుంది. మాయకు ధన్యవాదాలు చెప్పడానికి. దాహానికి మంచినీరిచ్చి, ” మీరు చాయ్ తాగుతారా. చేసి తెస్తాను ” అంటారు. ” మీ ఇంట్లో మీరు చాయ్ చేస్తారా. ఎంత మంచి భర్త మీరు. లాయర్ జీ ఎంత అదృష్టవంతురాలు”… అంటుంది కవిత. చెంపను ఛెళ్లన కొట్టిన ఫీలింగ్ శేఖర్ కు.
” మీ బాబుకు ఫుట్ బాల్ అందిందా?” అని అడుగుతుంది కవిత. అర్జున్ కు కేసు హడావిడిలో పడి ఫుట్ బాల్ ఎందుకు పంపలేదని తిడతాడు శేఖర్ అంతకుముందు. ” ఏం?? ఆపని అతనే చెయ్యచ్చుకదా! …నా వర్క్ అంటే ఎంత చిన్నచూపు ఇతనికి…” అని మనసులో బాధపడుతుంది మాయ.
తనూ, మాయ తమ పిల్లల గురించి మాట్లాడుకునేవారిమని చెప్తుంది కవిత. వెళ్లిపోతూ ” మీ భార్యాభర్తలిద్దరి వలనే జైలునుండి రాగలిగానని చెప్తూ, అర్జున్ కు ” షగున్” అని మనీ కవర్ ఇచ్చి వెళ్లిపోబోతుంటే, శేఖర్ ఆపి ” ఒక్క ప్రశ్నకు జవాబివ్వండి… మీరెందుకు ముఖేష్ ను కాల్చారు? నిజం చెప్పండి” అని అడుగుతాడు.
కవిత ఒక క్షణం ఆగి అంటుంది…. ” ఏమో! ఆ క్షణం నా బాధకు అంతం అదే అనిపించింది!”.. అని వెళ్లిపోతుంది. అయోమయంలో శేఖర్.
ఆమెతో దయతో మాట్లాడనందుకు, ఆమె భవిష్యత్తు ఏంటి అని పరామర్శించనందుకు తనను తను తిట్టుకుంటాడు. మాయ అయితే ఇంత indifferent గా, materialistic గా మాట్లాడదు కదా అనుకుంటాడు.
పార్టీనుండి తిరిగొచ్చిన మాయకు పూలతో స్వాగతిస్తాడు. శుభాకాంక్షలు చెప్తాడు. తన ప్రవర్తనకు సోరీ చెప్తాడు. తనో గురువులా, రోల్ మోడల్ లా ఆరాధించే శేఖర్ ప్రశంస కోసం తహతహలాడుతున్న మాయ కరిగిపోతుంది. ఇద్దరూ ఎన్నో ఒప్పందాలూ, రాజీల మధ్య మళ్లీ వాళ్ల అనురాగాన్ని పునరుద్దీపించుకుంటారు.
శేఖర్ కొడుక్కి ఫోన్ చేస్తాడు. ” బేటా! మీ అమ్మ పెద్ద కేస్ గెలిచింది. ఎవరిమీదో తెలుసా…. నాన్న మీద!” అని భార్యతో సహా మనస్ఫూర్తిగా నవ్వుతాడు.
గుప్పెడు ప్రేమ, చిటికెడు ప్రోత్సాహం, మనసారా మెప్పూ…… ఇవే కదా ఏ తరపు స్త్రీకయినా కావలసిన మూడుముళ్లు. ఆ మూడూ దొరికితే ఆమె తన చుట్టూ నందనాలే పెంచుతుంది. అవి దూరమయితేనే ఆ మూడుముళ్లు … ముళ్లే అవుతాయి.
నాటకమంతా తెరలముందు, తెరలచాటు. , తెరలమధ్య జరుగుతూ ఉంటుంది. May be between those unseen curtains and screens that describe our real lives behind the doors…! ఎంతో ఛాయావాదంగా ఉంటాయి కొన్ని విషయాలు. కిటికీలో గాజుకుండీలో పెంచే రెండు మొక్కలు…. ముందులో ఒకటి చిన్నగా.. మరొకటి ఏపుగా! మరికొంత సేపటికి రెండూ ఒకే లెవెల్ లో కానీ ఎడంగా , సమాంతరంగా!
కధలో చివరికి ఇద్దరూ తమ ఇద్దరిదీ పరస్పరం తప్పు కాదు, అదొక emotional state of mind
అని , అహాలు , హక్కులూ పక్కన పెట్టుకుని ఎవరి పాత్ర వాళ్లు పోషిద్దామని , మాయ తన కొత్త పథంలో తాను సాగిపోతూనే ఉండాలనే తీర్మానం చేసుకుంటారు…
ఇంగ్లీష్ , హిందీలో సాగే ఈ డ్రామాలో చాలా monotony ఉంది. ఒక్కోసారి మాయవాదనలు వితండంగా అనిపిస్తుంది( again my preconditioned pro husband obedience) . ఇవి melodramatic movies కాదు. జీవితాలలో ముఖ్య శకలాలలను వెలికితీసి చూపించే సత్యాలు.
ఇది ఫెమినిస్ట్ మూవీ కాదని చెప్పుకోడానికి Nandita Das చేసిన ప్రయత్నం మనకు కనిపిస్తుంది. ప్రతీ స్త్రీ జీవితంలో those subtle suppressions, ambiguity గురించి మాయ మాట్లాడుతుంటే మనకు సుస్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ” అవును కదా”.. అంటూ!
గంట సేపు డ్రామాలో వాళ్లు మాట్లాడే డైలాగ్ లన్నీ మన డ్రాయింగ్ రూమ్స్ నుండే ఎత్తుకుపోయినట్టు ఉంటాయి.
All my ” learned friends” already చూసేసి ఉంటారనే కధ విపులంగా రాసేసా! క్షమించేయండి.
-శశికళ ఓలేటి