సాహిత్య సృజన వెనుక చాలా కారణాలు ఉంటాయి. ఎన్నో పుస్తకాల వెనుక నేపధ్యం తెలుసుకుంటే చాలా అశ్చర్యకరమైన పరిణామాలు వెలుగు చూస్తాయి. “ఆనాటి వాన చినుకులు” అనే ఈ కథా సంకలనం వెనుక ఇటువంటిదే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఉంది. శ్రీ వేమూరి సత్యనారాయణ గారు ఎప్పుడొ 20 సంవత్సరాల క్రితం ఒక గూటీ రిక్షాపై ఆనాటి వాన చినుకులు అనే వాక్యాన్ని చూడడం జరిగిందట. ఆ వాక్యం ఇన్ని సంవత్సరాలుగా వారి మనసులో మెదులుతూనే ఉండి ఇప్పుడు ఇలా కథ సంకలనంగా రూపు దిద్దుకుంది. ఆ వాక్యాన్నే కొందరు రచయితులకు ఇచ్చి ఆ వాక్యాం ఆధారంగా వారిని కథను వ్రాయమని అడిగినప్పుడు పుట్టినవి ఈ 24 కథలు. అయితే ఈ వాక్యం విని ప్రతి రచయిత తన పద్దతిలో స్పందించి ఒక ఇతివృత్తాన్ని నిర్మించుకుని వైవిధ్యమైన 24 కథలు అందించారు. ఈ కథ మరో కథను పోలి ఉండదు. ఈ వాక్యం ద్వారా వంశీ గారు “భావుకుడు తయారుకాడు జన్మిస్తాడు” అనే నిజాన్ని మనముందుకు తీసుకువస్తే, వసుంధర గారు వృద్దాప్యంలో తన జీవితానికి ఒక అర్ధాన్ని వెతుక్కునే ఇంటి పెద్ద అయిన ఒక తల్లి మనసును ఆవిష్కరించారు. ఒక మనస్తత్వవేత్తగ్గా మారి రచయిత చేసే ఈ విశ్లేషణ అద్భుతం. పొత్తూరి విజయలక్ష్మి గారు భార్యాభర్తల కలయిక కు వాన చినకులను ఆలంబనగా తీసుకుంటే, నాయనీ కృష్ణమూర్తి గారు దేవుడిని, చైతన్యాన్ని శక్తికి ప్రతిరూపాన్ని ఈ చినుకులలో దర్శంప చేసారు.

కే వరలక్ష్మి గారు ఒక స్త్రీ జీవితంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఒక ప్రేమ కథ దాని అనుభూతులను వాన చినుకులతో పలకరిస్తే, ఆకునూరి హసన్ గారు అటువంటి మరో ప్రేమ జంటను మనకు పరిచయం చేస్తారు. కే వరలక్ష్మి గారి కథలో నాయిక తన ప్రేమికుడిని కలిసి తన గత అనుభూతి లో ని మాధుర్యాన్ని పాడు చేసుకోవాలనుకోదు కానీ హసన్ గారి కథలో నాయిక తన పాత ప్రేముకుడిని ఒక సారి కలిసి ఆ ఙ్ఞాపకాలకు ఒక రూపాన్ని ఇస్తుంది. వారణాసి నాగలక్ష్మి గారు ఆధిపత్య భావంతో విడిపోయిన ఒక జంటను కలపడానికి ఈ చినుకులను ఉపయోగించుకున్నారు. సాయి బ్రహ్మానందమ్ గోర్తి గారు బాల్యస్నేహితులు, ఆ ఙాపకాలను గుర్తుకు తెస్తే, ఈ వాక్యానికి చారిత్రిక నేపధ్యాన్ని జోడించి ఎట్టాయపురం జమిందారి వ్యవస్థను, ముత్తుస్వామి దీక్షితుల జీవితంలోని కొన్ని ఘట్టాలను మైధిలి అబ్బరాజు గారు మన ముందుకు తీసుకువచ్చారు.

పెద్దింటీ అశోక్ కుమారు గారు వాన చినుకుల నేపధ్యంలో మూతపడి పోతున్న ప్రభుత్య బడుల సమస్యలు స్పృశిస్తే, అపర్ణ తోట నేటీ విద్యావ్యవస్థ లో నలిగిపోతున్న పిల్లలు తల్లితండ్రుల బాధను చక్కగా చూపించారు. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు గ్రామాలలో మాయమవుతున్న నేటివిటీ గురించి ప్రశ్నిస్తే, దాట్లదేవదానం రాజు గారు రైతు కూలీల నిజాయితిని ఈ వాన చినుకులలో చూసారు. డా. వాసిరెడ్డీ రమేష్ బాబు గారు గతాన్ని మరిచి జీవితాన్ని మలుచుకునే ఇద్దరు నవ దంపతులను తన వాన చినుకులతో పరిచయం చేస్తే, దగ్గుమాటి పద్మాకర్ గారు అలా కొత్త జీవితం వైపు అడుగువేయలేని ఒక నిస్సహాయ తండ్రిని పరిచయం చేశారు. రసరాజు గారి వాన చినుకులు అందమైన ప్రేమకథను సుఖాంతం చేస్తే, వాడ్రేవు వీరలక్ష్మి గారు “ఎవరు చెప్పారు ప్రేమిస్తే కలిసే వుండాలని” అని ఆ వాన చినుకులను భ్రధ్రంగా దాచుకున్న ఒక ప్రేమికురాలు జీవిత సారాన్ని పరిచయం చేస్తారు. కుప్పిలి పధ్మ గారు ఈ వానచినుకుల నేపధ్యంలో ప్రేమ, స్నేహం, ఆత్మీయత అనే భావాల మధ్య క్లారిటిె వెతుక్కుంటే,చంద్ర కన్నెగంటి గారు జ్ఞాపకమూ ఊహల మధ్య వ్యత్యాసాన్ని కనుక్కునే ప్రయత్నం చేశారు. రాజారామమోహనరావు గారు ప్రెమికుల మొదటి కలయికకు నెపద్యంగా వానచినుకులను వాడుకుంటే, ఆకెళ్ళ శివప్రసాద్ గారు ఒక భావుకుడు వ్యాపారస్తుడిగా మారి మళ్ళీ తాను కోల్పోయిన జీవితం వైపు ప్రయాణించడానికి వారధిగా ఈ వాన చినుకుల సహాయం తీసుకున్నారు.నాగేంద్ర కాశి గారు పెద్దల పట్టుదలకు తలవంచిన ప్రేమను గుర్తుతెఛుకుంటే, తనికెళ్ళ భరణి గారు దూరమవుతున్న ఒక ప్రేమ జంట ఆఖరి సంభాషణను గుర్తుచేసారు. చివరిగా వేమూరి సత్యనారాయణగారు ఆ గతకాలపు రిక్షా ను కనుక్కునే ప్రయత్నంలో చాలా దూరం మనలను తీసుకెళ్ళీ ఆఖరికి ఆ భావుకుడుని కలిసినా తనకు దొరకని సమాధానం, దొరికీ దొరకనట్టు మిగిలిపోయిన కథను పరిచయం చేస్తారు.

వాక్యం ఒకటే కాని దాని చుట్టూ అల్లుకున్నవి ఇన్ని కథా వస్తువులు.ఒక మూడు పదాల వెనుక ఎన్ని కథలు, వ్యథలు, జీవితాపు రహస్యాలను సోధించవచ్చొ ఈ రచయితలందరూ తమ శైలిలో నిరూపించారు. ఇటువంటీ ప్రయోగం మరో భాషలో వచ్చిందొ లేదో తెలీదు కాని ప్రతి కథ చదువుతుంటే ఆ ఒక్క వాక్యం ఎందరిలో ఎన్ని ఆలోచనలను రేకెత్తించిందో చూస్తే శ్రీ శ్రీ గారి వాక్యం “కాదేది కవితకనర్హం” అన్నది గుర్తుకొచ్చి అసలు కథా వస్తువుకు సృజనాత్మకత ఉన్న రచయితలున్నంత వరకు కొరత ఉండదు కదా అనిపించింది. అక్షరానికి ఎంత పదునుందో, శక్తి ఉందొ ఇంతమంది మస్తిష్కాలను పదును పెట్టిన “ఆ నాటి వాన చినుకులు” అన్న చిన్న వాక్యం జన్మ ఇచ్చిన ఈ కథా సంకలనాన్ని చదివి అర్ధం చేసుకోవచ్చు. ఇది చదివి మనకు గుర్తుకు వచ్చే వాన చినుకులను ఆస్వాదిద్దాం.
జ్యోతి.పి

Leave a comment