నీహారికా,

ఇతరులకు సంతోషం పంచి ఇవ్వడంలో మనకు సంపూర్ణమైన ఆనందం లభిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో కూడా మనకి నవ్వులు, పలకరింపులు కావాలి. ఒక్కోసారి మనలో ఉత్సాహం నశించి పోతూవుంటే దాన్ని ఇవ్వగల స్నేహితులు కావాలి. సందేహం వచ్చినప్పుడు ఆత్మ విశ్వాసం కలగాలి. మనకు సత్యం స్వీకరించగల హృదయం ఉండాలి. జీవితం పరిపూర్ణంగా వుండాలంటే మనకు నిజమైన ప్రేమ లభించాలి. ఇలా వేయి విధాల ఆనందం వుందనుకో, మనం అప్పుడా సంతోషాన్ని ఇతరులకు రెండు చేతులా పంచగలం, ప్రార్ధించగలం. మనస్పూర్తిగా ఎదుటివారి మేలు కోరి, వారి కుటుంబంలో చిన్నా పెద్ద పరివారం సుఖంగా ఉండాలని తలుచుకోగలం. ముందుగా మన జీవితం, ఎలా వుంటుందో దాన్ని యథాతధంగా స్వీకరించగలిగితే మనకు సంతోషం మాత్రమే దొరుకుతుంది. ఇందులో నిరాశలకు, అసూయలకు తావు ఇవ్వరాదు. మనం చేసే పనులు మనకే ఆనందాన్ని ఇవ్వాలని లేదు. అవి ఇతరులను ఆనందపెట్టినా మనకూ ఆనందమే మిగులుతుంది. ఇతరుల కష్టాన్ని తీర్చగలమని, వాళ్ళకి తోడూనీడగా ఉండగలమని మనస్పూర్తిగా అనుకోగలిగితే ఆ పని చేసినందువల్ల కలిగే ఆనందంతో మన రోజు ఆనందంతోనే నడుస్తుంది. ఒక పువ్వో, ఒక చిన్న మెచ్చుకోలు, మంచి మాట ఇతరులకు ఆనందం ఇస్తుంది. ఈ మాత్రం మనసు మనకు లేదా?

Leave a comment