నీహారికా,
ఎవర్నయినా పలకరిస్తే ఎప్పుడూ బిజీ అనే అంటారు. ఎంత బిజీగా అంటే మన గురించి మనం ఆలోచించుకోలేనంతగా. కానీ ఇలా వుంటే నష్టం కదా. ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొంటే ఈ బిజీ అన్న పదం ఎన్ని సార్లు, ఏవిధంగా ఉపయోగించి ఆత్మానందం పోగొట్టుకున్నామో అర్ధం అవుతుంది. స్నేహితుల్ని కలవడం, ఒక ఫంక్షన్ కు పోవడం, మంచి సినిమా చూడటం, ఇంట్లో నలుగురితో కలిసి భోజనం చేయడం, ఓ అరగంట కబుర్లు చెప్పటం ఇవన్నీ బిజీ అన్న పదంతో కొట్టిపారేస్తారు. కానీ ఇవన్నీ సంతోష మార్గాలు. జీవితపు పరుగులో విశ్రాంతి ఇచ్చే పద్ధతులు. ఇవి చెపితే వినాలనుకోరు. అప్పుడూ బిజీనే అంటారు. ఓ పది నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించుకొంటే, ఆత్మావలోకనం చేసుకుంటే అర్ధం అవుతుంది మనం ఏం పోగొట్టుకున్నామో. సంపాదన, కెరీర్ ఇవన్నీ భవిష్యత్ ఆనందం కోసమే. భద్రత కోసమే. కానీ ఆ పరుగు తీసే సమయంలో మనసు పై పడే వత్తిడి తగ్గించుకొనే, మార్గాయాసం తీర్చుకునే చలివేంద్రాల వంటి కొన్ని గంటలు, ఆత్మీయులతో గడిపే కొద్ది నిముషాలు పోగొట్టుకుంటే జీవితం చివరలో సాధించేదేమిటి? కాలం మన కోసం తిరిగి యవ్వనం ప్రసాదించదు.