చేస్తున్న పని కింద పడేసి ఇంకా ఇవ్వాల్టికి నేనే పని చేయను అని ఒళ్ళు మండేంత కోపం తెప్పించే సర్వే గురించి చెప్పుకొందాం. ఒక అంతార్జాతీయ సర్వేలో టర్కీ,కొరియా,నార్వే,ఇటలీ,కెనడా, జర్మనీ, అమెరికా …ఇదిగో ఇండియాతో సహా ఒక సర్వే నిర్వహించారు. పురుషులు ఇంటి పనికి ఎంత సమయం కేటాయిస్తారు? ఇదే విషయం ఇంటి పని అంటే అది ఆడవాళ్ళ ఆస్తి హక్కులాగా నెత్తిన పెట్టుకునే బ్రహ్మాండం. అసలా పని వాళ్ళదే… అని మన దేశపు మొగాళ్ళు అనుకుంటారని మనకు తెలుసుగాని అంతర్జాతీయ సర్వే రిపోర్ట్ ఇది నూరు శాతం కరెక్ట్ అంది. ఈ సర్వే నిర్వహించిన దేశాల వరుసలో స్లోవేకియాలో పురుషులు రెండు గంటలు సమయం ఇంటి పనికి కేటాయించి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో డెన్మార్క్, ఎస్టోనియాలు ఉన్నాయి. అందరికంటే అట్టడుగున గర్వంగా నిలబడింది మన భారతీయ మగ పురుషులే, వీళ్ళు సగటులో రోజుకు 19 నిమిషాలు ఇంటి పనికి కేటాయిస్తున్నారట. ఇదే సమయంలో ఆడవాళ్ళు చాలా స్పీడ్ గా చేసినా ఐదు గంటల సమయం పనుల్లోనే ఉండి పోతున్నారట. ఈ రిపోర్ట్ చదివాక భారతీయ మహిళలు పిచ్చి చాకిరీలు చేస్తూ దాన్నే ఆనందం అనుకుంటూ తప్పు చేస్తున్నారెమో కదా.

Leave a comment