లావెండర్ తోటలు చూస్తుంటే కన్నుల పండుగ అనే పదం సరిగ్గా సరిపోతుంది .ఫ్రాన్స్ లోని ప్రోవెన్స్, ల్యూబెరాన్ వాలెన్సోల్ భూముల్లో వందల ఎకరాల్లో లావెండర్ తోటలు వేస్తారు.జూన్ లో మొదలై ఆగస్టు లో ముగిసే ఈ లావెండర్ పూల సీజన్ లో నేలంతా వంగ రంగులోకి మారిపోయి నట్లు అవుతుంది .తీరుగా గీత గీసినట్లు భూమిపైన వంగపూవు రంగు పూవులు వికసిస్తాయి.మెరిసే ఆకు పచ్చని ఆకుల మధ్య నిలువుగా కాడలతో పూసే లావెండర్ వనాలు ప్రకృతి ఇచ్చిన సంపదలు ఇవే కదా అనిపిస్తాయి .ఈ పువ్వు నుండి తీసిన నూనె ఆరోమా థెరఫీ లో ముఖ్యంగా ఉపయోగిస్తారు.ఈ మొక్కలోని ఔషధ గుణాలు వాణిజ్య విలువల్ని గుర్తించిన ఫ్రెంచ్ జాతీయులు శతాబ్దాల క్రితమే వందల ఎకరాల్లో ఈ పంటను పండించటం మొదలుపెట్టారు..ఈ తోటల అందం ప్రపంచం మొత్తం తెలిసిపోయి ఇదో అంతర్జాతీయ టూరిస్ట్ ప్రదేశం అయిపోయింది.పర్యాటకుల జాతర మొదలైంది పూల సీజన్ లో పెద్ద సంఖ్యలో టూరిస్ట్ లు రావటంతో ఇక్కడ రైతుల ఆదాయం కూడా పెరిగింది .సృష్టిలో అందమంతా పోగు పోసినట్లు కనిపించే ఈ లావెండర్ తోటలను జీవితంలో ఒక్క సారైనా చూడకపోతే మనకే నష్టం .