ఇప్పుడిక నా దేశ భక్తిని చాటుతూ ఊగి పోవాలి
మనసులోని మాటను వ్యక్తం చేయడం రాకపోయినా సరే
కనీసం నలుగురు ఫార్వార్డ్ చేసిన పోస్ట్ అయినా సరే
నరాలు తెగే భక్తి పొంగిపొర్లేదైతే షేర్ కొట్టేస్తే నీలో దేశభక్తి ఉప్పొంగుతున్నట్లే
లేకపోతే
నువ్వు కోలుకోలేని ముద్ర ఏదో నిను వెంటాడుతుంటుంది
నీకు తెలియని వారెవరి నియంత్రణలోకో నీ ఊపిరి వెళ్ళి పోతుంది
వారికి నచ్చిన పేరేదో పలకమంటూ నీ గొంతుపై కత్తి వేలాడుతుండొచ్చు
లేదా
నీ నోటిలోకే మలమూత్రాదులు జారి పడుతుండొచ్చు
కలల కుత్తుకల్లో ప్లాస్టర్ ఉండలు కుక్కేసి
భవిష్యత్తును దర్శించాల్సిన కళ్ళను నాలుగు గోడల గంతలకు బలి చేసి
బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచేసి
సైనిక పహారాల మధ్య ప్రాణాలరచేతిలో ఉగ్గబట్టిన
బిక్కు బిక్కుమనే నీ చీకటి బతుకుపై
నీకు తెలియకుండానే శాసనాలు పుట్టుకు రావొచ్చు
నీవు మెసలాల్సిన తీరుపై
నీవు తినాల్సిన తిండిపై
నీవు కట్టాల్సిన బట్టపై
నీవు మనాల్సిన చోటుపై
నీవు మెలగాల్సిన వ్యక్తులపై
అకస్మాత్తుగా నిర్ణయాలు జరిగిపోతాయి
నీ ప్రమేయం లేకుండానే తీర్పులు చెల్లుబడి అవుతుంటాయి
నిన్ను ఆవిష్కరించే మాటేదైనా
నీ గుండెలోనే దాచుకోవాలి
అప్పుడే
ప్రజాస్వామిక నిర్వచనాలెన్నో శాంతిగా నీ చెవులను చేరతాయి
సాటి మనిషికోసం పడే నీ అడుగుల్లో వినయ విధేయతలు కనీస లక్షణం కావాలి
అప్పుడే
సహనపు నాణేల గలగలల పార్శ్వాలు నీ జాడను గమనిస్తాయి
నీవు పొంగించే భక్తి ఏదైతే ఉందో అది కనీసంగా నీకు శ్రోతలనివ్వాలి
అప్పుడే
కొలమానికల గుండెలు సంతృప్తితో పారవశ్యంలో మునిగి తేలుతాయి
అప్పుడిక నా దేశ జెండా మాత్రమే పాపిట సిందూరంలా రెపరెపలాడుతుంది
పండుగ మాధ్యమాల్లో ప్రవర్థమానంగా విలసిల్లుతుంది
– నస్రీన్ ఖాన్