గుండె నొప్పి వచ్చినపుడు వేసుకోవాల్సిన మందులు ముఖ్యంగా రెండురకాలు.
ఒకటి హాస్పిటల్ వెళ్ళేంత వరకూ నొప్పిని తగ్గించే మందులు ఐతే…రెండు, హాస్పిటల్ లో ఈసీజీ తీసాక అందులో మార్పులు acute coronary Syndrome ని సూచించినట్టైతే వెంటనే ఇచ్చే మందులు. మొదటి రకాన్ని “నైట్రేట్స్” అనీ రెండో రకాన్ని “యాంటీ ప్లేట్ లెట్స్” అనీ అంటారు.
ఐతే ఈ రెండు రకాల్లో చాలా మందికి మొదటి రకం మందు గురించే తెలుసు. అదే నాలుక కింద పెట్టుకోమని చెప్పే సార్బిట్రేట్ అనే టాబ్లెట్. ఇది 5mg లేదా 10 mg గా దొరుకుతుంది. ఇది నాలుక కింద పెట్టుకుంటే నొప్పి తగ్గే అవకాశం ఉంది. ఐతే 5mgతో మొదట మొదలు పెట్టాలి. నొప్పి తగ్గక పోతే పది నిమిషాల తరువాత ఇంకో 5mg వాడితే చాలు. ఐనా నొప్పి తగ్గటం లేదని ఈ మందులను అలా వాడుతూనే పోకూడదు. ఎందుకంటే ఈ మందులు వలన పేషెంటు బీపీ తగ్గిపోతుంది. హార్ట్ పేషంట్లలో అవసరమైన దానికన్నా బీపీ తగ్గితే డేంజర్ కూడా..
నిజానికి మొదటి రకం మందులను వాడకపోయినా పర్వాలేదు. కానీ మనిషి ప్రాణాన్ని కాపాడేది మాత్రం రెండో రకమైన యాంటీ ప్లేట్ లెట్స్ మందులే. ఇవి heart attack అని ఇదమిత్థంగా ఈసీజి ద్వారా తెలిసినప్పుడు డాక్టర్లు ఇస్తారు. మామూలుగా ఇచ్చే డోస్ ల కంటే ఎక్కువ డోస్ లో ఇస్తారు. దీనిని లోడింగ్ డోస్ అంటారు.
Disprin 300mg
Clopitab 600mg
Atorvas 80 mg
త్వరగా వ్యాధి నిర్ధారణ జరిగిన tertiary hospital కు చేరుకునేలోపలే వీటిని ఉపయొగించినట్టైతే, జరిగే మేలు అంతా ఇంతా కాదు. ఐతే తప్పనిసరిగా డాక్టరు చెప్పినప్పుడు వేసుకోవటం మంచిది.
Disprin లేదా ecosprin అనేది 75, 150, 300, 325,350 mg లుగా దొరుకుతుంది. మనకు 300-350 mg వేసుకోవాలి కాబట్టి 75 mg దొరికితే నాలుగు, 150 mg దొరికితే రెండు ట్యాబ్లెట్లు ఇస్తారు. రక్తం లో త్వరగా ఆ మందు చేరాలంటే ecosprin అనే టాబ్లెట్ కంటే…నీళ్ళల్లో కరిగే disprin వాడటం మంచిది. Disprin ట్యాబ్లెట్ ను సగం గ్లాసు నీళ్ళలో వేయగానే క్షణాల్లో కరిగిపోతుంది. ఆ నీళ్ళను తాగేస్తే సరి. అదే ecosprin ఐతే నోటి ద్వారా మింగాలి.
క్లోపిడోగ్రెల్ మందు క్లోపిట్యాబ్ ట్యాబ్లెట్ రూపంలో దొరుకుతుంది. 75, 150,300 mg డోసులుగా దొరుకుతుంది. దొరికిన డోస్ ను బట్టి మనకు కావలసిన 600mg dose కు ఎన్ని ట్యాబ్లెట్లు అవసరమో అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి.
Atorvas 10,20,40,80 mg లు గా దొరుకుతుంది. 10mg దొరికితే 8 ట్యాబ్లెట్లు ఒకేసారి వేసుకోవాల్సిందే…
“అయ్యో.. ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలా” అని మీన మేషాలు లెక్కబెట్ట కూడదు. డాక్టరు చెప్పాక వేసుకోవాల్సిందే. ఇన్ని ట్యాబ్లెట్ల వలన కడుపులో మంట రాకుండా , rantac, pantoprazole వంటి ఇంజెక్షన్ లు కూడా డాక్టర్లు ఇస్తుంటారు.
ఇకపై సెకండరీ సెంటర్ హాస్పిటల్స్ లో ఈసీజీ తీసాక acute coronary Syndrome అని డాక్టర్లు నిర్ధారించాక, లోడింగ్ డోస్ గురించి మీరే డాక్టర్లకు చెప్పగలరా?!
–-డాక్టర్.విరివింటి.విరించి(కార్డియాలజిస్ట్)