మానని గాయాలను
మరోసారి నిద్రలేపే ప్రపంచం
కూడా మన చుట్టూరా ఉంటుంది

ఏ మూల నుంచి
ఏ ముల్లు దూసుకొస్తుందో
మానక ముందే
మరింత సలుపును పెంచే
పదును వాటిదై ఉండొచ్చు

నీవు అల్లుకున్న గూడు
నీ సొంతం
చిరునామా
అందరికీ తెలియనవసరంలేదు
తెలిసాక చదరంగంగా మార్చొచ్చు

చాచేవి స్నేహ హస్తాలే
చూసేవి చెలిమి చూపులే
లోన దాగిన విషపు హృది
అకస్మాత్తుగా ఎగిరి పడుతుంది

ధృతరాష్ట్ర పరిష్వంగాల పనేమి
ఒంటరి గమనమే సౌఖ్యమైనప్పుడు
నీవు కట్టుకున్న ఆనందాల హరివిల్లు
మరెవరికో ధారపోయకు

– నస్రీన్ ఖాన్

Leave a comment