వేసవి వస్తే ఎండల భయం ఉంటుంది. మల్లెల సుగంధం మనసుని పరవళ్లు తొక్కిస్తుంది. మాఘ మాసం నుండి మొదలై ఆషాఢ జల్లుల వరకు పలకరించే ఈ అద్భుతమైన మల్లెల సౌరభాలంటే అందరికీ ఇష్టమే. ప్రపంచవ్యాప్తంగా జాస్మిన్ జల్లులు ఎన్నో ఉన్నప్పటికీ మనకు తెలిసిన మల్లె జాతి మాత్రం జాస్మినం సంబర్.దీన్నే అరేబియన్ జాస్మిన్ మల్లికా కుండ మల్లిగై మోగ్రా అంటూ అనేక రకాల పేర్లతో పిలుస్తారు. పూలరేకులు పరిమళం బట్టి కూడా ఇందులోనూ రకాలున్నాయి. ఒకే వరసలో ఐదు అంతకంటే ఎక్కువ రేకులతో ఉండేదే బొండుమల్లి గుండుమల్లి రేఖ మల్లి అంటారు. ఎండ తగులుతుంటే ఏడాది పొడవునా పూసే మల్లెలుంటాయి. చూసేందుకు చిన్న గులాబిల్లా ముద్దుగా వుండే రోజ్ జాస్మిన్ లేదా నెంటు మల్లె అంటారు. దొంతర మల్లెల్లో పూరేకులు అరలు అరలుగా ఉంటాయి. మాఘ మల్లికా స్టార్ జాస్మిన్ అని పిలిచే మల్లియలు ఆకు కనిపించకుండా మొత్తం తెల్లగా పూసేస్తాయి. ఇవే కాదు నేల తీరు వాతావరణం బట్టి ఒక్కో మల్లె మొగ్గది ఒక్కోఅందం. ఒక్కో మధురమైన పరిమళం. ఈ మధ్యనే పేటెంట్ పొందిన మధురై మల్లెలు మీనాక్షి అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ఆమెను అలంకరించేది ఈ మల్లెలతోనే . అసలే అందమైన మీనాక్షి దేవి విగ్రహంపైన మల్లెల మాలలు అందమే అందం.