వారణాసి నాగలక్ష్మి చదువుకున్నది రసాయనశాస్త్రమైనా ఆమె అభిరుచి సాహిత్యం లోనూ, చిత్రలేఖనంలోనూ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ ఎంఫిల్ చేసి కొంతకాలం ఉద్యోగం చేశారు. చిన్నప్పటి నుంచీ లలితగీతాలు, కథలు, వ్యాసాలు, కవితలూ వ్రాస్తూ ఉన్నా వీరి మొదటి పుస్తకం వానచినుకులు వెలువడింది 2003 లో. దానికి 2004లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహితీ పురస్కారం లభించింది. తర్వాత ఆలంబన, ఆసరా, వేకువపాట కథా సంపుటాలు, ఊర్వశి అనే నృత్య నాటిక వెలువడ్డాయి. కథా రచనకు అబ్బూరి రుక్మిణమ్మ పురస్కారం, లేఖిని పురస్కారం, అమృతలత అపురూప పురస్కారం, యమ్వీయల్ ఆత్మీయ సత్కారం మొదలైన కొన్ని గుర్తింపులు లభించాయి. దాదాపు అన్ని ప్రముఖ వార, మాస, దిన పత్రికలలో వీరి రచనలు ప్రచురితమయ్యాయి. కొన్నిటికి బహుమతులు లభించాయి.
నాగలక్ష్మి గారి కథలలో కొన్ని శ్రీమతి శాంతసుందరి రామవరపు గారి అనువాదంలో బోల్తీ తస్వీర్ కథా సంపుటిగా హిందీ లో వెలువడ్డాయి.. కొన్ని కథలు మరాఠీ, ఆంగ్లం, తమిళం, కన్నడ భాషలోకి అనువదించబడ్డాయి. ఆకాశవాణి ద్వారా వీరి పాటలు, కథలు, వ్యాసాలు, నాటికలు ప్రసారమయ్యాయి. సాహిత్యంతో పాటు చిత్రలేఖనంలోనూ ప్రవేశం ఉండడం వల్ల తన పుస్తకాలకు ముఖచిత్రాలు, లోపల కథకు తగిన బొమ్మలు వేసుకోవడమే కాక, ఇతర రచయితల పుస్తకాలకు కూడా వీరు ముఖ చిత్రాలు అందించారు. అనేక పెయింటింగ్ ప్రదర్శనల్లో పాల్గొనడం, బహుమతులు పొందడం జరిగింది. గత పది సంవత్సరాలుగా ‘రంగ్ రేఖ’ పేర చిన్నారులకు చిత్రలేఖనంలో శిక్షణ ఇస్తున్నారు.

Leave a comment