– డి.సుజాతా దేవి

రాజో అంటాదిరా నన్ను
రారాజు మంటాదిరా మల్లి
మా రాజు వంటాదిరా!!

నేల చేరడైన లేదు
కూలికెల్లి బతికెటోణ్ణి
నేనేమి రాజునే అంటే
నా రాజు నువ్వంటదీ మల్లి
నవ్వుల్ల నానౌతది
పువ్వుల్ల చెండౌతది!!

జోడెద్దులు కొనలేక
కాడి మూలవెట్టినోణ్ణి
నే నేడ రాజేడ అంటే
జోడెద్దు తానంటది మల్లి
కాడి మోయ రమ్మంటది
ఓడిపోను లెమ్మంటది!!

ఆలికి కూడెట్టలేక
కూలికి పంపేటోణ్ణి
నేనా మారాజు వంటే
నా నీడ తానంటది మల్లి
ఇడిసుండలే వంటది
యాడుంటె ఆడుంటది!!

Leave a comment