నీహారికా,

నువ్వడిగిన దానికి ఓ పద్యం సమాధానంగా  ఉంది. ‘నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ‘ అని. ఎవళ్ళనీ నొప్పించకుండా సంతోషపెడుతూ స్నేహంగా ఉండటం కష్టమే. కానీ అసాధ్యం కాదు. అందుకు సుమతీ  శతకం లో చెప్పినట్లు తప్పించుకు తిరగనక్కర్లేదు కానీ మాటలు రువ్వినట్లు కాకుండా పిల్ల తెమ్మెర లాగా తాకినట్లు వాడితే అందరితో కలుపుకుపోవచ్చు. ఇరుగు పొరుగు స్నేహితులు బంధువులు తోటి ఉద్యోగులు కుటుంబ సభ్యులు ఎవరితోనైనా చెరగని చిరునవ్వుతో మాట్లాడితే చాలు. రోజువారీ పనులు బాధ్యతలు మధ్యనే ఎన్ని వత్తిడులు ఉంటాయి. మూడ్స్ మారిపోతుంటాయి. వాటి తాలూకు ప్రభావం ఇతరులతో మాట్లాడేటప్పుడు పడకుండా జాగ్రత్తగా వుండాలి. అలాగే ఎదుటివాళ్ళకు హేళన చేస్తున్నట్లో కించ పరుస్తన్నట్లు అస్సలు మాట్లాడకూడదు. అలాగే అతిగా చనువు తీసేసుకోకూడదు. వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో జోక్యం వద్దు. నలుగురిలో మన మాటే కరెక్ట్ ని మన మాటే చెల్లాలనీ అనుకోకూడదు. సరైన సాయం చేయవలిసిన అవసరం వస్తే చేతనైతే చేయటం లేదా లేదు. ఎప్పుడూ మాటలతో ఎదుటి వాళ్ళను తక్కువ చేయకుండా ఉంటే ఈ పువ్వులాంటి సువాసన భరితమైన  పోగడపువ్వుల్లాంటి సంపెంగల్లాంటి మాటలు మాట్లాడటం చేతనైతే నీహారిక  ఈ ప్రపంచంలో నాకెదురైన ప్రతి మనిషీ నీకు ఆప్తుడే ఆత్మీయుడే !!

Leave a comment