త‌మిళ‌నాడుకు చెందిన ఆ మ‌హిళా రైతు మాత్రం ఏకంగా అర ఎక‌రానికే 43 బ‌స్తాల వ‌రి పండించి రికార్డు సృష్టించింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఓ మ‌హిళే ఈ ఘ‌న‌త‌ను సాధించింది. అది కూడా ఆమె ఓ ఉపాధ్యాయురాలు కావ‌డం విశేషం.
ఆమె పేరు ప్ర‌స‌న్న‌. త‌మిళ‌నాడులో నివాసం. ఓ ప్రైవేటు పాఠ‌శాల‌లో సైన్స్ అధ్యాప‌కురాలిగా ప‌నిచేస్తోంది. అయితే చిన్న‌ప్ప‌టి నుంచి ప్ర‌స‌న్న‌కు వ్య‌వ‌సాయం అంటే ఎంత‌గానో ఇష్టం. ఆమె తండ్రి కూడా ఆమె ఇష్టాన్ని గ‌మ‌నించి నిత్యం పొలానికి తీసుకెళ్లేవాడు. అంతేకాదు ఆమె క‌ళాశాల‌లో చేరినా రోజూ పొలానికి వెళ్లి వ‌చ్చాకే కాలేజీకి వెళ్లేది. ఈ క్ర‌మంలో ఆమె ఎమ్మెస్సీ బీఈడీ కూడా పూర్తి చేసి టీచ‌ర్‌గా ఉద్యోగం చేయ‌డం ప్రారంభించింది. అయితే వ్య‌వ‌సాయం మీద మ‌క్కువ ఉండ‌డంతో ఓ రైతునే పెళ్లి కూడా చేసుకుంది. కాగా త‌మిళ‌నాడుకు చెందిన వ్య‌వ‌సాయ శాస్త్రవేత్త‌లు కొత్త‌గా శ్రీ‌వ‌రి అనే వంగడాన్ని క‌నిపెట్ట‌డంతో స‌ద‌రు విత్త‌నం గురించి తెలుసుకుని దాన్ని పండించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

అలా ప్ర‌స‌న్న అనుకున్న‌దే త‌డవుగా సంబంధిత అధికారుల‌ను క‌లిసి విత్త‌నాల‌ను తీసుకుని పంట‌లు వేసింది. కానీ మొద‌టి రెండు సార్లు విఫ‌ల‌మైంది. అయితే ఈ సారి ఎలాగైనా స‌ద‌రు విత్త‌నంతో మంచి దిగుబ‌డి రాబ‌ట్టాల‌నుకుంది. ఈ క్ర‌మంలో కృత్రిమ ఎరువుల జోలికి పోకుండా పూర్తి స్థాయిలో సేంద్రీయ ప‌ద్ధ‌తిలో త‌యారు చేసిన ఎరువుల‌ను వాడింది. అయితే ఈ సారి ఆమె అనుకున్న‌ట్టుగానే అత్యంత ఎక్కువ‌గా దిగుబ‌డి సాధించింది. సాధార‌ణంగా ఒక ఎకరా వ‌రి పొలానికి దాదాపుగా 40 బ‌స్తాలు పండుతాయి, కానీ ప్ర‌స‌న్న చేసిన సాగుతో, శ్రీ‌వ‌రి విత్త‌నం కార‌ణంగా ఆమె అర ఎక‌రం పొలంలోనే ఏకంగా 43 బ‌స్తాలు (3223 కిలోలు) వ‌రి పండింది. ఈ క్ర‌మంలో మొద‌ట్నుంచీ ప్ర‌స‌న్న చేస్తున్న సాగును, ఆమె వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌ను అధికారులు రిజిస్ట‌ర్‌ల‌లో న‌మోదు కూడా చేశారు. దీంతో చివ‌రికి ఆమె సాధించిన దిగుబ‌డి రికార్డు స్థాయిలో ఉండ‌డంతో ఆమెకు రూ.5 ల‌క్ష‌ల న‌గదు కూడా అందించారు.

Leave a comment