Arrhythmias.

Acute coronary Syndrome లో గుండె కండరం డ్యామేజ్ అవుతుంది. అది కోలుకోలేని డ్యామేజ్.‌ అంటే డ్యామేజ్ ఐన గుండె కండరం మళ్ళీ మామూలు స్థితికి జీవితాంతం రాదన్నమాట‌. అందుకే కండరం డ్యామేజ్ ని తగ్గించడం, డ్యామేజ్ కాకుండా మిగిలిన కండరాన్ని కాపాడుకోవటం అనేదే ప్రధానమైన చికిత్సా విధానం. ఇంతకు ముందు చెప్పిన థ్రాంబోలైసిస్ కానీ PCI కానీ డ్యామేజ్ ఐన కండరానికి సత్వరమే రక్త సరఫరాను పునరుద్ధరించటం కోసం ఉపయోగపడతాయి. తద్వారా వీలైనంత ఎక్కువ కండరం దెబ్బతినకుండా కాపాడ గలుగుతాం. అందుకే సమయం వృథా కాకుండా వీలైనంత త్వరగా ఈ చికిత్స మొదలు పెట్టాలి. డాక్టర్లు అసలేం చేయబోతున్నారో అర్థం కాక వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోలేక డెసిషన్ మేకింగ్ లో గంటలు గంటలు వృథా చేయటం జరుగుతూ ఉంటుంది. పేషెంట్ అటెండర్లకు ఈ చికిత్సా విధానాల గురించి చెప్పినప్పుడు మా మామ రావాలి, అన్న రావాలి వచ్చాక నిర్ణయం తీసుకుంటాం అనేవారూ ఉంటారు. ఫోన్లలో చర్చలు జరుపుతూ కాలాయాపన చేసే వారూ ఉంటారు. తద్వారా నష్టం వారికే. ఏదేమైనా పేషంటు బంధువుల అనుమతి లేనిది ఏ డాక్టర్ కూడా ఏమీ చేయలేడు. కండీషన్ అర్థం చేసుకోవడం వలన క్రిటికల్ సమయంలో డాక్టర్లకు సహకరించగలిగితే outcome ఆశా జనకంగా ఉంటుంది.

. గుండె కండరం డ్యామేజ్ ఎంతయిందనే విషయం మనకు 2d echo troponin T or I అనే పరీక్షల ద్వారా తెలుస్తుంది. Severe damage ఉంటే గుండె పంపింగ్ కెపాసిటీ 30శాతానికన్నా తక్కువకు పడిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో పేషంటుకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అవుతుంది. స్టడీస్ ప్రకారం ఇటువంటి severe condition లో ఉన్న పేషెంట్లలో నూటికి ఎనభై శాతం మరణం సంభవించే అవకాశం ఉంది. గుండె పనితీరు దారుణంగా పడిపోవటం వలన ఊపిరితిత్తులలో నీరు చేయటం(pulmonary edema) కిడ్నీలు పని ఆపేయటం జరగవచ్చు( acute kidney failure). అందువల్ల వీరికి వెంటిలేటర్, డయాలిసిస్ లు కూడా అవసరం కావచ్చు.

ఇంకో భయంకరమైన కండిషన్ ఏమిటంటే… గుండె కండరం డామేజ్ కనుక ఇంకా ఎక్కువగా ఉంటే గుండె లో పేస్ మేకింగ్ కెపాసిటీ పోతుంది. అప్పుడు ఒక రిథం ప్రకారం కొట్టుకునే గుండె ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటుంది. వీటినే అరిథ్మియా అంటారు‌. ఇది heart attack వచ్చాక ఏ క్షణంలోనైనా రావచ్చు. ఎపుడు వస్తుంది ఎవరికి వస్తుంది అని ప్రెడిక్ట్ చేయటం కష్టం. అరిథ్మియాలలో ventricular tachycardia అనీ ventricular fibrillation అనీ రెండు భయంకరమైన రకాలు heart attack పేషంట్లలో వస్తాయి. ఇవి రాగానే ఉన్నచోట ఉన్నట్టుగానే మనిషి కుప్ప కూలిపోతాడు. హాస్పిటల్ లో ఉంటే ఈసీజీ లో కనిపించే రిథం ను బట్టి electric shock ఇవ్వటం జరుగుతుంది. అలా ఇచ్చే పరికరాన్ని cardioverter- defibrillator అంటారు. ఎలక్ట్రోడ్ లను ఛాతిపై ఉంచి అవసరమైనంత తీవ్రతలో షాక్ ఇస్తారు. అవసరానుకూలంగా ఇతర సపోర్టింగ్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇలా గుండె ఇష్టం వచ్చినట్టు కొన్ని క్షణాలు కొట్టుకుని సడెన్ గా ఆగిపోవచ్చు. దానిని cardiac arrest అంటారు. అరిథ్మియాలు రావటం వెనువెంటనే కార్డియాక్ అరెస్ట్ జరగటం కూడా సంభవమే. కార్డియాక్ అరెస్ట్ ఐనప్పుడు CPR వెంటనే మొదలుపెడతారు.

–డాక్టర్.విరివింటి.విరించి(కార్డియాలజిస్ట్)

Leave a comment