ఇపుడు ఒక వ్యక్తికి ఛాతిలో నొప్పి వచ్చిందనుకుందాం. దగ్గరలోని హాస్పిటల్ లో ఈసీజీ తీయిస్తే…ఈసీజీలో మార్పులు ఉన్నాయనుకుందాం.. అప్పుడు అక్కడి డాక్టర్లు higher centre కి వెళ్ళమని చెబుతారు. ఐతే చాలా మంది పేషెంట్లు “ఏం ఇక్కడ కాదా?! ఎందుకు కాదు?!” అని గొడవ పడటం మొదలు పెడతారు. కేవలం ఈసీజీ ఫెసిలిటీ ఉన్నంత మాత్రాన, గుండె జబ్బుకు ట్రీట్మెంట్ చేయగలిగే ఫెసిలిటీ ఆ హాస్పిటల్ లో ఉండాలని లేదు. ఎందుకంటే heart attack ట్రీట్మెంట్ కి ఐసీసీయూ ఫెసిలిటీ ఉండాలి. అందులో 24 hr గుండె డాక్టర్లు అందుబాటులో ఉండాలి. ఇంకా అదనంగా అనెస్తెటిస్ట్, వెంటిలేటర్ ఫెసిలిటీ కూడా ఒక్కోసారి అవసరం రావొచ్చు. కాబట్టి చిన్న హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్ వంటి చోట డయాగ్నోసిస్ కావొచ్చు కానీ ట్రీట్మెంట్ జరగదు. అక్కడి డాక్టర్లు పేషంట్ కండీషన్ లోని సీరియస్ ను చూసి వెంటనే tertiary care hospitals కి రిఫర్ చేస్తారు.

ఐతే ఈసీజీ లో మార్పులు చూసి, అది మేజర్ హార్ట్ ఎటాక్’ అని నిర్ధారణ చేసుకున్నాక ” లోడింగ్ డోస్ ” అనబడే మందులను డాక్టర్లు సాధారణంగా ఇస్తారు. పేషెంట్ వయసు, బరువు ఇత్యాదివి దృష్టిలో ఉంచుకుని ఒక్కోసారి హెపారిన్ ఇంజెక్షన్ కూడా ఇస్తారు. ఈ మందులు ఇవ్వటం అనేది ఒక ప్రాథమిక చికిత్స. పేషెంట్ లైఫ్ ను ఇవే కాపాడతాయి కూడా. tertiary hospital కి వెళ్ళే వరకు ఇవి గుండె రక్తనాళాల మీద పనిచేసి గుండె మీద భారాన్ని తగ్గిస్తాయి.

ఐతే విచారకరమైన అంశం ఏమంటే చిన్న హాస్పిటల్స్ లో ఈ ప్రాథమిక చికిత్స తెలిసినా కూడా డాక్టర్లు ఇవ్వటం లేదు. ఎందుకంటే మనం దేశంలో “డాక్టర్లు పేషంట్లను మందులిచ్చి చంపేస్తారు” అనే పుకారు బలంగా ప్రజల మనుసుల్లోకి చేర్చబడింది. జీవితాల్ని కాపాడే మందులను ” ఇంగ్లీష్ మందులు” అనీ అవన్నీ “కెమికల్స్” అనీ అనవసర భయాల్ని సృష్టించటం జరిగింది. అవే నిజమనుకునే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదువుకున్న వాళ్ళకూ ఉన్నాయంటే..మన దేశంలో literacy level కూ awareness కూ సంబంధం లేదనీ, science ని గౌరవించే మనుషులు లేరనీ తెలుస్తోంది. ఈ మందులు ఇచ్చాక tertiary hospital కి వెళ్ళే దారిలో పేషెంట్ వ్యాధి తీవ్రత వలన ప్రాణాలు వదిలితే…పేషెంట్ బంధువులు తిరిగి వచ్చి…మీరు ఇచ్చిన మందులవలననే పేషెంట్ చనిపోయాడని గొడవ చేయటం..ఇటువంటి విషయాల మీద ఏ మాత్రం అవగాహన లేని లోకల్ లీడర్లు అందుకు వంత పాడటం..నష్ట పరిహారంగా డాక్టర్లను డబ్బులు డిమాండ్ చేసి బెదిరించడం…ఇత్యాదివన్నీ నిత్య కృత్యాలవటం వలన… సెకండరీ సెంటర్ హాస్పిటల్స్ లో ప్రాథమిక చికిత్స కూడా జరగటం లేదు. ఇటువంటి పరిస్థితి ఒక్క మన భారతదేశంలోనే ఉంది.

అంటే జరగవలసిన ప్రాథమిక చికిత్స కూడా జరగకుండానే కార్లలో అంబులెన్సు లలో పేషెంట్లు దూరంగా ఉండే tertiary hospitals కి వెళుతున్నారు. ఒక వేళ అది మరింత దూర ప్రయాణమైతే అక్కడికి చేరే వరకే పేషెంట్ కండీషన్ మరింత దిగజారి పోవటం జరుగుతుంటుంది. ఇంతకు మించిన విచారకరం ఏముంటుంది 70 యేళ్ళ స్వతంత్ర భారతంలో.

-డాక్టర్.విరివింటి.విరించి(కార్డియాలజిస్ట్)

Leave a comment