నీహారికా,

నీ అనుభవం నీ వయసులో ఉండే ఎంతో మందికి ఎదురయ్యిందే. ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకుని కష్టపడి పనిచేస్తావు గుర్తింపు రాదు. ఆఫీసులో ఒక సెక్షన్ హెడ్ గా అవుతావు, మిగతా వాళ్ళు సరిగ్గా మాట వినరు. ఇలా ఒక్క కెరీర్ లోనే కాదు వ్యక్తిగత జీవితంలోను ఎన్నో ఓటములు ఉంటాయి. వాటి నుంచి బయట పడాలంటే చాలా నిబ్బరం కావాలి. అలా ఎప్పుడైనా ఓటమి ఎదురయితే ఉద్వేగంతో స్పందించకూడదు, నియంత్రణలో ఉండాలి. వీలైతే అలాంటి వాతావరణానికి కాస్త దూరంగా ఉండేలా చూసుకోవాలి.కాసేపు రిలాక్సయి అసలు ఏం జరిగింది, ఎందుకిలా అయిందో, మన వైపు నుంచి పొరపాటు ఏమైనా వుందా అన్న విషయంపై స్పష్టత తీసుకుని ఆలోచిస్తే పరిష్కారం తెలిసిపోతుంది. ఎంత ఒదార్చుకున్న ఓటమి మనల్ని శారీరకంగా కుంగదీస్తుంది. ఆహారం సహించదు, ఓ పట్టాన నిద్ర వుండదు. అలాంటప్పుడు మనకిష్టమైన ఏదో వ్యాపకంలోకి వెళ్లిపోవాలి. అలాగే ఓటమి ఎవరిపైనో కోపంగా మారుతుంది. ఇలా అయితే మనల్ని మనం తక్కువ చేసుకొన్నట్లే. మన విలువలు మనం కోల్పోయినట్లే అందుకే ఇలాంటి ఉచ్చులో పడద్దు. మన ఓటమిని ఉక్రోషంతో ఇంకొకళ్ళ పైన ద్వేషంగా మార్చుకొంటే నష్టం మనకే. అందుకే స్వీయ నియంత్రణ తెచ్చుకోవాలి. ఓటమి అంటూ వస్తే ఆ నిరాశ లోంచి బయట పడే మార్గం ఇదొక్కటే నిబ్బరంగా ఉండటం.

Leave a comment